అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసారు. అమెరికాకు స్వర్ణయుగం ప్రారంభమైందని, తాను ప్రమాణం చేసిన రోజు దేశానికి విమోచన దినమనీ వ్యాఖ్యానించారు. అమెరికాను మళ్ళీ గొప్ప దేశంగా తీర్చిదిద్దుతానంటూ మరోసారి ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక చేసిన తొలి ప్రసంగంలో డొనాల్డ్ ట్రంప్, అమెరికా స్వర్ణయుగం ప్రారంభమైందన్నారు. తాను వైట్‌హౌస్‌లో ప్రవేశించడంతో అమెరికాకు గతంలో ఎన్నడూ లేనంత గొప్ప అవకాశాలు వస్తాయని ధీమా వ్యక్తం చేసారు.
‘‘అమెరికా త్వరలోనే మరింత గొప్పగా, బలంగా, గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా ఎదుగుతుంది. నేను ఎంతో ధైర్యంగా, ఆశావాదంతో, ఆత్మవిశ్వాసంతో మళ్ళీ అధ్యక్షుడిని అయ్యాను. ఇకపై మన జాతిని విజయపథంలో నడిపే దిశగా ప్రయాణం సాగుతుంది. దేశాన్ని మార్పు అనే కెరటం ముంచెత్తుతుంది. ప్రపంచమంతా వెలుగు ఆవరిస్తోంది. ఆ వెలుగును అందిపుచ్చుకునే అవకాశం గతంలో ఎన్నడూ లేనంత గొప్పగా అమెరికాకు ఉంది’’ అని ట్రంప్ ఆశావాదంతో చెప్పారు.
అదే సమయంలో తమ ముందున్న సవాళ్ళ గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు. ‘‘మొదట, మనం ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి నిజాయితీగా ఆలోచించాలి. మనకు చాలా సమస్యలే ఉన్నాయి, కానీ ఈ గొప్ప సమయంలో అవన్నీ తుడిచిపెట్టుకుపోతాయి’’ అని ధైర్యం నూరిపోసారు. స్వేచ్ఛ, సమృద్ధి, గర్వం కలిగిన దేశంగా అమెరికాను తీర్చిదిద్దడమే తన మొదటి ప్రాధాన్యమని ట్రంప్ స్పష్టం చేసారు.
వాషింగ్టన్ డి.సి.లోని యుఎస్ క్యాపిటల్‌లో అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేసారు. అమెరికా ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్, ట్రంప్‌తో ప్రమాణం చేయించారు. అంతకుముందు అమెరికా ఉపాధ్యక్షుడిగా జె.డి.వాన్స్ పదవీప్రమాణం చేసారు.
గత అధ్యక్ష అభ్యర్ధి వివేక్ రామస్వామి, ట్రంప్ సహచర ఎంపీలు, అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జి బుష్, బరాక్ ఒబామా… మాజీ ప్రథమ మహిళలు హిలరీ క్లింటన్, లారా బుష్, ట్రంప్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ప్రపంచ కోటీశ్వరుడు ఎలాన్ మస్క్, మెటా సీఈఓ మార్క్ జుకెర్‌బర్గ్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తదితర ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల ప్రతినిధులు ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలియజేసారు.