అస్సాం స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఢుబ్రీ జిల్లాలో ఓ కరడుగట్టిన జిహాదీ ఉగ్రవాదిని అరెస్ట్ చేసారు. అతివాద ఇస్లామిస్టు ఉగ్రవాద సంస్థకు చెందిన అతన్ని జాహెర్ అలీగా గుర్తించారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్‌టీఎఫ్ పోలీసులు జనవరి 18 రాత్రి బిలాసిపారా ప్రాంతంలో సోదాలు చేసారు. ఆటోరిక్షా డ్రైవర్‌గా మారువేషంలో ఉన్న జాహెర్ అలీని గుర్తించి అరెస్ట్ చేసారు. తదుపరి దర్యాప్తు కోసం అతన్ని గువాహటిలోని ఎస్‌టీఎఫ్ ప్రధాన కార్యాలయానికి తరలించారు.
జాహెర్ అలీ, బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేసే అన్సారుల్లా బంగ్లా టీమ్ (ఏబీటీ) అనే ఉగ్రవాద సంస్థ కార్యకర్త. తమ ఉగ్రవాద సంస్థలోకి అస్సాంకు చెందిన ముస్లిం యువకులను చేర్చుకునే పని మీద అతను ఢుబ్రీ జిల్లాకు వచ్చాడు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న ఢుబ్రీ జిల్లాలో ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థకు ఒక కార్యక్షేత్రాన్ని తయారు చేసే పనిలో ఉన్నాడు. అక్కడ అతను ఆటోడ్రైవర్‌గా మారువేషంలో జీవిస్తూ తన ఉనికిని దాచిపెట్టాడు.
ఎస్‌టీఎఫ్ గతంలో అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో వరుసగా సోదాలు చేపట్టింది, గత డిసెంబర్ 17, 18 తేదీల్లో జిహాదీ నెట్‌వర్క్‌లతో సన్నిహిత సంబంధాలున్న 12మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. వారిలో ఒకరు బంగ్లాదేశ్‌లో మోస్ట్ వాటెడ్ టెర్రరిస్టుగా పేరు గడించిన ఉగ్రవాది కూడా ఒకడున్నాడు.