పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రొవిన్స్‌లో సియాల్‌కోట్‌లోని దస్కా ప్రాంతంలో ఒక మసీదును కూల్చివేసారు. పాకిస్తాన్‌లో మైనారిటీలైన అహ్మదీ తెగ ముస్లిములకు చెందిన మసీదు అది. నిజానికా మసీదు, పాకిస్తాన్ దేశం ఏర్పడిన 1947 ఆగస్టు కంటె చాలా ముందు నుంచీ ఉంది. పాకిస్తాన్ మొట్టమొదటి విదేశాంగ శాఖ మంత్రి జఫారుల్లా ఖాన్ పూర్వీకులు నిర్మించిన మసీదు అది.
అహ్మదీ తెగ వారికి చెందిన ఆ మసీదును నిర్మించిన నాటినుంచీ ఇప్పటివరకూ ఎలాంటి మార్పులూ చేయలేదు, లేదా విస్తరించలేదు. జమాత్ అహ్మదీయా పాకిస్తాన్ అధికార ప్రతినిధి ఆమిర్ మొహమ్మద్ వివరణ ప్రకారం.. జనవరి 15న ఆ మసీదుకు అధికారులు ఒక నోటీసు పంపించారు. ఒక రోడ్డును ఆక్రమించి ఆ మసీదు కట్టారని, అందువల్ల కూల్చివేయక తప్పదనీ ఆ నోటీసు సారాంశం. అప్పటికీ అహ్మదీయ తెగకు చెందిన వారు ఆ మసీదులో 13 అడుగుల స్థలాన్ని వదిలేసారు.
అయినా అధికారులు పట్టించుకోలేదు. అహ్మదీ తెగ వారి వాదన అరణ్యరోదనగా మిగిలిపోయింది. అధికారులు మొదట, ఆ మసీదులో తాము ఆక్రమణగా భావించిన ప్రాంతాన్ని కూలగొట్టారు. అక్కడితో ఆగకుండా మొత్తం మసీదు నిర్మాణాన్నే కూల్చివేసారు. ఎలాగైనా తమ మసీదును రక్షించుకోవాలని అహ్మదీయులు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. గురువారం రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వ్యవధిలో దస్కా అసిస్టెంట్ కమిషనర్ మహామ్ ముస్తాక్, స్థానిక పోలీసులతో కలిసి కూల్చివేత పనులను దగ్గరుండి పూర్తిచేయించాడు. ఆ నాలుగు గంటలూ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరెంట్ కూడా తీసేసారు.
అహ్మదీ తెగవారు ముస్లిములే అయినప్పటికీ వారికి పాకిస్తాన్‌లో కనీస గుర్తింపు లేదు. చాలాకాలంగా ఆ దేశంలో ఊచకోతకు గురి అవుతున్న అహ్మదీ తెగ ఇప్పుడు నామమాత్రంగా మిగిలింది. వారిని, వారి ప్రార్థనా స్థలాలనూ లేకుండా చేయడమే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. 2024 ఒక్క సంవత్సరంలోనే పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రొవిన్స్‌లో అహ్మదీయులకు చెందిన 22 మసీదులను కూల్చివేసారు. ఇంక దేశవ్యాప్తంగా ఎన్ని మసీదులను కూల్చేసారో లెక్కే లేదు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా, తమను రక్షించేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని అహ్మదీ తెగ అధికార ప్రతినిధి ఆమిర్ మొహమ్మద్ విజ్ఞప్తి చేసారు. అయితే పాకిస్తాన్‌లో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఆ తెగ వారికి ఎవరికీ లేదు.
పంజాబ్ ప్రొవిన్స్‌ను పరిపాలిస్తున్నది ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధానమంత్రి అయిన షెబాజ్ షరీఫ్ మేనకోడలు మరియం నవాజ్ షరీఫ్ కావడం గమనార్హం. పంజాబ్, పాకిస్తాన్‌లోని అతిపెద్దదీ, శక్తివంతమైనదీ అయిన ప్రొవిన్స్. అక్కడ గత రెండేళ్ళుగా అహ్మదీయులను లక్ష్యంగా చేసుకుని భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. ఆ సంగతిని ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించి, పాక్ ప్రభుత్వానికి సుద్దులు చెప్పింది. అయినప్పటికీ అహ్మదీ తెగ ముస్లిములపై దాడులు ఆగడమే లేదు. మైనారిటీ అహ్మదీ తెగను తుడిచిపెట్టేవరకూ పాకిస్తాన్ ఆగేలా లేదు. ఆ దేశంలో సున్నీ ముస్లిములదే మెట్టువాటా.