స్కిల్ ఇంటర్నేషనల్ ఇనీషియేటివ్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్‌డిసి), టూ కామ్స్ అనే సంస్థతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఆ మేరకు రాష్ట్రంలోని నర్సింగ్ నిపుణుల కోసం జర్మన్ భాషా శిక్షణ, ప్లేస్‌మెంట్ లింక్డ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఈ అవగాహనా ఒప్పందం ప్రకారం… అర్హులైన అభ్యర్థులకు జర్మన్ భాషలో 8-10 నెలల వ్యవధిలో శిక్షణ ఇస్తారు, వారికి జర్మన్ హెల్త్ కేర్ రంగంలో నర్సులుగా ఉపాధి కల్పిస్తారు. 2COMS సంస్థ సహకారంతో జర్మన్ భాషా శిక్షణ, ప్లేస్‌మెంట్ మొదటి బ్యాచ్ ప్రారంభోత్సవం ఇవాళ కర్నూలు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో జరిగింది. ఆ కార్యక్రమంలో కర్నూలు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి మంజులారాణి, జిల్లా ఉపాధి అధికారిణి పి. దీప్తి, కర్నూలు DSDO ఎల్ ఆనంద్ రాజ్‌కుమార్, నంద్యాల DSDO వి శ్రీకాంత్ రెడ్డి, టూ కామ్స్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజర్ ఆకాంక్ష, తదితరులు పాల్గొన్నారు.
ఆ సందర్భంగా ఏపీఎస్ఎస్‌డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి మనోహర్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్య సంరక్షణ నిపుణులకు విలువైన భాషా నైపుణ్యాలు కల్పించడం, వారికి ప్రపంచ ఆరోగ్య సంరక్షణ మార్కెట్‌లో ఉపాధి అవకాశాలు పెంచడమే తమ లక్ష్యమని చెప్పారు. అనేక యూరోపియన్ దేశాలలో జర్మన్ భాషా ప్రావీణ్యానికి అధిక డిమాండ్ ఉంది, ఇది నర్సులకు గొప్ప ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. అనుభవజ్ఞులైన సర్టిఫైడ్ భాషా బోధకులచే శిక్షణ అందిస్తారు. తద్వారా మన రాష్ట్రంలోని నర్సింగ్ విద్యార్ధులు జర్మన్ భాష నేర్చుకుంటారు, అంతర్జాతీయంగా ఉపాధి అవకాశాలను పొందగలుగుతారని మనోహర్ వివరించారు.
ఆ కార్యక్రమంలో కర్నూలు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ, ఏపీఎస్ఎస్‌డీసీ సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.