కోల్‌కతాలోని ఆర్జికర్ ఆసుపత్రి వైద్యురాలిపై గత ఏడాది ఆగష్టు 9న జరిగిన హత్యాచారం కేసులో సంజయ్ రాయ్‌ను కోర్టు దోషిగా తేల్చింది. కేసును విచారించిన కోల్‌కతాలోని సీల్దాకోర్టు జీవిత ఖైదు విధించింది. గత ఏడాది ఆగష్టు 9న రాత్రి విధుల్లో ఉన్న మహిళా డాక్టర్ ఆసుపత్రిలోని సెమినార్ హాలులో సేద తీరుతుండగా హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ ఘటన కలవరానికి గురిచేసింది. దీనిపై మొదట కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తరవాత కేసును సీబీఐకి అప్పగించారు.
ఘటన తరవాత ఆర్జీకర్ ఆసుపత్రిలో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ కేసులో సామూహిక అత్యాచారం జరిగినట్లు సీబీఐ ఎక్కడా పేర్కొనలేదు. కేసులో సంజయ్ రాయ్‌ను మాత్రమే చేర్చారు. ఘటన తరవాత సాక్ష్యాలు తారుమారు చేసిన కేసులో ఆర్జీకర్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, మాల్దా పోలీస్ స్టేషన్ సీఐ అభిజిత్‌పై కూడా అభియోగాలు మోపారు. తరవాత అనుబంధ ఛార్జిషీట్ వేయకపోవడంతో వారికి 90 రోజుల్లో బెయిల్ లభించింది.
కేసును సీబీఐ ఫాక్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపారు. విచారణ పూర్తి చేసిన న్యాయమూర్తి ఇవాళ మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు తీర్పు వెలువరించారు. తీర్పు చెప్పే సమయంలో కోర్టు వద్ద పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. ఈ కేసులో దోషి సంజయ్ రాయ్ తన వాదనలు తానే వినిపించుకున్నారు.