మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ విచారణకు ధర్మాసనం మార్పు చేయాలంటూ టీడీపీ ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు రిజిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం నుంచి జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనానికి మార్చింది.
గడచిన పన్నెండేళ్లుగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ కూడా వేయలేదని, సీబీఐ, నిందితులు కుమ్మక్కయ్యారని రఘురామరాజు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇప్పటికే ఐదుగురు జడ్జిలను తీర్పు వెలువరించే సమయానికి బదిలీ చేసినట్లు సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.తుది నిర్ణయం తీసుకునే సమయంలో జడ్జిల బదిలీలు అనుమానాలకు తావిస్తోందని న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
కేసును మూడు సంవత్సరాలు విని డిశ్చార్జ్ అప్లికేషన్‌పై తుది నిర్ణయం వెలువడే సమయంలో జడ్జిల బదిలీలు చేయడం చూస్తుంటే సీబీఐ, నిందితులు కుమ్మక్కు అయ్యారనిపిస్తోంది రఘురామరాజు తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అందుకే ట్రయల్ కోర్టు మార్చాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.కేసుల బదిలీ సాధ్యం కాదని గతంలోనే సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసులో పూర్తి పర్యవేక్షణ జరగాలని తాము కోరుకుంటున్నట్లు న్యాయవాది వాదనలు వినిపించారు.
కేసుల ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసినట్లు దర్యాప్తు సంస్థ తరపు న్యాయవాది వివరించారు. కేసును తెలంగాణ హైకోర్టు మానిటర్ చేస్తుందన్నారు. అక్కడ కేసు పెండింగులో ఉందని న్యాయవాది రోహత్గీ తెలిపారు. పదేళ్లుగా జగన్ బెయిల్‌పై ఉన్నట్లు రఘురామరాజు తరఫు న్యాయవాది గుర్తుచేశారు.కేసులో వాదనలు వినిపించేందుకు సమయం కావాలంటూ సీబీఐ తరఫు న్యాయవాది కోరారు. దీనిపై సోమవారం విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది.