ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తొలి విడత అమలులో భాగంగా ఆదివారం ముగ్గురు ఇజ్రాయెలీ మహిళలను హమాస్ విడిచిపెట్టింది. వారు తమతమ ఇళ్ళకు చేరుకున్నారు. దాంతో వారి కుటుంబ సభ్యుల ఆనందానికి అంతే లేకుండా పోయింది.
పాటల పండుగ చేసుకుంటున్న ఇజ్రాయెల్ మీద హమాస్ ఉగ్రవాదులు దాడి చేసి ఎత్తుకుపోయిన వారందరినీ వెనక్కు తిరిగి ఇచ్చేవరకూ దాడులు ఆపేది లేదంటూ ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అలా హమాస్ ఎత్తుకుపోయిన వారిలో ముగ్గురు మహిళలు – రోమీ గ్నెన్, ఎమిలీ దమారీ, డొరొన్ స్టెయిన్‌బ్రెచెర్ – 471 రోజుల తర్వాత ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. తమ కుటుంబాలను కలుసుకున్నారు.
ముగ్గురు బందీల విడుదల విషయాన్ని ఐడిఎఫ్, తమ ఎక్స్ మాధ్యమం ద్వారా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ దక్షిణభాగం వద్ద హమాస్ వారిని విడిచిపెట్టింది. ఐడిఎఫ్ అధికారులు వారిని వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత వారు తమ తల్లులను కలుసుకున్నారు.
ఇజ్రాయెల్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8.30కు బందీలను విడిచిపెట్టాల్సి ఉంది. అయితే అది సుమారు మూడు గంటలు ఆలస్యమైంది. హమాస్ తమ దగ్గర బందీలుగా ఉన్నవారిలో ఆ ముగ్గురినీ 11.15 గంటలకు ఇజ్రాయెల్‌కు అప్పగించింది. హమాస్ తాము విడుదల చేయనున్న అందరు బందీల జాబితానూ ఇస్తే తప్ప తాము ఒప్పందానికి కట్టుబడబోమనీ, ఆ ఒప్పందాన్ని హమాస్ ఏవిధంగా ఉల్లంఘించినా తాము సహించబోమనీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. దాంతో ఆ ముగ్గురు బందీల విడుదలలో జాప్యం చోటు చేసుకుంది. ఏదేమైనా, ముగ్గురు అమ్మాయిలు స్వదేశానికి చేరుకోవడం ఇజ్రాయెల్‌కు సంతోషకరం అని దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ప్రకటించారు.