స్విట్జర్లాండ్లోని దావోస్లో యేటా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం బయలుదేరి వెళ్ళింది. ఆ బృందం కొద్దిసేపటి క్రితం జ్యూరిక్ నగరానికి చేరుకుంది.
సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ సహా ఉన్నతాధికారుల బృందం కూడా ఉంది. వారంతా జ్యూరిక్ విమానాశ్రయానికి భారత కాలమానం ప్రకారం ఈ మధ్యాహ్నం 12 గంటలు దాటాక చేరుకున్నారు. అక్కడ విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారుల బృందానికి యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులూ ఘనంగా స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్ బృందం మరికాసేపట్లో పెట్టుబడిదారులతో జ్యూరిక్ నగరంలో సమావేశం అవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఆ సమావేశంలో రాష్ట్రంలోకి పెట్టుబడులు ఎలా పెట్టాలి అన్న అంశంపై చర్చలు జరుపుతారు.
మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యూరిక్ విమానాశ్రయంలో కలుసుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది.