సైబర్ నేరగాళ్లు బరితెగించారు. మీరు ఇటీవల కొత్తగా కొనుగోలు చేసిన సిమ్‌కు గిఫ్ట్ వచ్చిందంటూ ఫోన్ చేసి చెప్పిన సైబర్ నేరగాళ్లు కొరియర్ ద్వారా బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరుకు కొత్త ఫోన్ పంపించారు. నిజమేనని నమ్మిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫోను తీసుకుని వెంటనే తన ఫోనులోని సిమ్ కొత్త ఫోనులో వేశారు. ఇక అంతే సంగతి. అతని ఫోనుకు కొన్ని ఓటీపీలు వచ్చాయి. కొత్త ఫోను కదా యాప్‌లు అప్డేట్ అవుతున్నాయని భావించారు. కాసేపటి తరవాత చూస్తే బ్యాంకు ఖాతా నుంచి రూ.2.8 కోట్లు కొల్లగొట్టారని గ్రహించాడు. వెంటనే బెంగళూరు వైట్‌ఫీల్డ్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
సైబర్ నేరగాళ్ల ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుకుతున్నారు. తాజాగా వైన్ యాప్ పేరుతో దోపిడీకి తెరలేపారు. జంప్ డిపాజిట్ పేరుతో కోట్లు కొల్లగొట్టారు. ఇవాళ కొత్త ఫోన్ వచ్చిందంటూ కోట్లు కాజేశారు. ఇలా సైబర్ నేరగాళ్ల వేయని ఎత్తులు లేవు. మీరు కొత్త ఫోన్ గెలుచుకున్నారంటూ ఎవరైనా పంపిస్తే పొరపాటున కూడా తీసుకోవద్దని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి నేరాలు గమనిస్తే వెంటనే 1930 నెంబరుకు కాల్ చేయాలని సూచిస్తున్నారు.