గడచిన ఆరు మాసాల్లో ఏపీకి రూ.3 లక్షల కోట్ల విలువైన సాయం చేసినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. గన్నవరం మండలం కొండపావులూరులో ఎన్డీఆర్‌ఎఫ్ ఆవిర్బావ వారోత్సవాల్లో పాల్గొన్న షా మరో మూడేళ్లలో ఏపీ మొత్తం పోలవరం నీరు పారిస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీఆర్‌ఎఫ్ దళాలను చూస్తేనే ప్రజలకు భరోలా లభిస్తుందని కొనియాడారు. వారి సేవలకు విదేశాలు సైతం అబ్బుర పడుతున్నాయన్నారు.
అమరావతి రాజధానికి హడ్కో ద్వారా రూ.27 వేల కోట్ల సాయం అందిస్తున్నట్లు అమిత్ షా గుర్తుచేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఏపీని విధ్వంసం చేసిందని, అయినా చింతించాల్సిన పని లేదని, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దుర్మార్గపు పాలన నుంచి ఏపీ బయట పడిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తుందన్నారు.
గన్నవరం మండలం కొండపావులూరులో 2018లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ఎఫ్ బెటాలియన్ దక్షిణ భారతదేశంలోనే అతి కీలకమైనది. తాజాగా 200 కోట్లతో పలు భవనాలు నిర్మించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నూతన భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఏపీ బీజేపీ అధ్యక్షులు పురందేశ్వరి పాల్గొన్నారు.