ప్రయాగ్ రాజ్ మహాకుంభ మేళా భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల, వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చిందన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు భారత్ కు వచ్చి ప్రయాగ్ రాజ్ లో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారని తెలిపారు. ఈ పరిణామం ప్రతీ భారతీయుడు గర్వించదగ్గదన్నారు. దేశ యువత తమ ఆచార సంప్రదాయాలను తెలుసుకున్నప్పుడే మూలాలు బలపడతాయని అభిప్రాయపడ్డారు.
మన్ కీ బాత్ పేరిట ప్రతీ నెలా చివరి ఆదివారం నిర్వహించే కార్యక్రమాన్ని ఈ సారి మూడో ఆదివారమే నిర్వహించారు. చివరి ఆదివారం నాడు(జనవరి 26) గణతంత్ర దినోత్సవం ఉండటంతో నేడే
మన్ కీ బాత్ బాత్ 118వ ఎపిసోడ్ ప్రసారం చేశారు.
ఈ గణతంత్ర దినోత్సవం చాలా ప్రత్యేకమైనదన్న ప్రధాని మోదీ, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతుందని గుర్తు చేశారు. రాజ్యాంగ పరిషత్‌లోని గొప్ప వ్యక్తులందరికీ తలవంచి నమస్కరిస్తున్నా అన్నారు.
ఎన్నికల సంఘం, ఓటింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆధునీకరించి, పటిష్ఠం చేస్తోందని ప్రధాని కొనియాడారు. సాంకేతికతను ఉపయోగిస్తూ నిష్పక్షపాతంగా పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందన్నారు.
దేశాభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంచిన ప్రధాని మోదీ, నేటి యువత తమ అభివృద్ధి గురించి మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధికి కూడా కృషి చేస్తోందన్నారు. దీపక్ నబం అనే వ్యక్తి అంకుర సంస్థ ద్వారా నిరాశ్రయులకు సహాయం చేస్తున్నాడని అభినందించారు.