మోసపూరిత కాల్స్, మెసేజ్‌లకు అడ్డుకట్ట వేసేందుకు టెలికాం శాఖ కొత్తగా సంచార్ సాథీ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ఈ యాప్‌ను విడుదల చేశారు. అనుమానిత కాల్స్ వచ్చినప్పుడు మొబైల్ ఫోన్ లాగ్ నుంచే నేరుగా ఫిర్యాదు చేయడంతో పాటు ఫోన్ బ్లాక్ చేసే సదుపాయాలు ఇందులో ఉన్నాయి.
సంచార్ సాథీ పోర్టల్‌ను 2023లో కేంద్ర టెలికాం శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. మొబైల్ యాప్‌ను లాంచ్ చేయడంతో మరింత సమర్థంగా మోసాలను అరికట్టవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లో ఈ యాప్ ను వినియోగించవచ్చు.
ఈ యాప్ ద్వారా ఒకరి పేరిట ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. అనధికారికంగా ఏవైనా నంబర్లు ఉంటే ఫిర్యాదు చేసే అవకాశం కల్పించడం విశేషం. మొబైల్ పోయినప్పుడు, చోరీ జరిగినప్పుడు బ్లాక్ చేసే సదుపాయం ఇందులో ఉంది. ఫోన్ ప్రామాణికతను కూడా యాప్ తో తెలుసుకోవచ్చు. సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోలు సమయంలో ఈ ఫీచర్ ఉపయోపడుతుంది.