ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటుకు ‘ఎయిర్‌బస్’ ఆసక్తి…!
అనంతపురం జిల్లాలో స్థల కేటాయింపులు..
ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమ ఏర్పాటుకు మరో ప్రతిష్ఠాత్మక సంస్థ రానున్నట్లు అధికార, రాజకీయవర్గాల్లో జరుగుతోంది. రాష్ట్రంలో హెచ్125 హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విమానాల తయారీ సంస్థ ‘ఎయిర్‌బస్’ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఫ్రాన్స్‌కు చెందిన ఈ సంస్థ భారత్‌లో హెలికాప్టర్లు తయారు చేయాలని ఇప్పటికే నిర్ణయించినట్లుగా పలువురు చెబుతున్నారు. ప్లాంటు ఏర్పాటు కోసం కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను పరిశీలించింది.
ఆంధ్రప్రదేశ్‌ను తమకు అనువైన రాష్ట్రంగా ఎయిర్ బస్ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. కియా కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటుతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన అనంతపురాన్నే ఇందుకు అనువైనదిగా భావించినట్లుగా ప్రచారం జరుగుతోంది. హెలికాప్టర్ల తయారీ యూనిట్ కోసం అనువైన స్థలాన్ని కేటాయించాలంటూ జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు కూడా అందినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఈ విషయంపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయలేదు.
‘హెచ్125’ అనేది సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ కాగా ఇందులో గరిష్ఠంగా ఆరుగురు ప్రయాణించవచ్చు. పహారా, విపత్తులు, పర్యాటక రంగంలో దీనిని వినియోగించవచ్చు. గరిష్ఠంగా గంటకు 289 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది.