ఫిఫా 2030 ప్రపంచ కప్ నిర్వహించేందుకు స్పెయిన్, పోర్చుగల్, మొరాకో ఇప్పటి నుంచే ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. పర్యాటకులను ఆకర్షించేందుకు మొరాకో 30 లక్షల కుక్కలను చంపేయాలని నిర్ణయించింది. మొరాకో నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొరాకో నిర్ణయంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
వీధి కుక్కలను తగ్గించేందుకు మొరాకో అమానవీయమైన చర్యలకు ఉపక్రమించిందని అంతర్జాతీయ మీడియా దుయ్యబట్టింది. అత్యంత విషపూరితమైన రసాయనాలతో కుక్కలను చంపేస్తున్నారని మీడియా కథనాలు ప్రచురించింది. బహిరంగ ప్రదేశాల్లో కుక్కలపై విష ప్రయోగం చేయడం, పారలతో కొట్టి చంపడం చేస్తున్నారని జంతు ప్రేమికులు నిరసనలు ప్రారంభించారు.
కుక్కలను కాపాడేందుకు జంతు హక్కుల న్యాయవాది జేన్ గూడాల్ రంగంలోకి దిగారు. కుక్కలను చంపకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఫిఫాను కోరారు. కుక్కలను చంపేందుకు క్రూరమైన పద్దతులు విడనాడాలని సూచించారు. ఇలాగే కుక్కలను చంపేస్తే మొరాకోలో జరిగే టోర్నమెంటును అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. జంతు పరిరక్షణకు చట్టాలున్నా మొరాకో పట్టించుకోవడం లేదని జంతు హక్కుల న్యాయవాది తీవ్ర విమర్శలు చేశారు.