తీర్పు వెల్లడించిన న్యాయస్థానం
జనవరి 20న శిక్ష ఖరారు చేయనున్న జడ్జి
పశ్చిమ బెంగాల్ లోని ఆర్జీకర్ ఆస్పత్రి లో యువ వైద్యరాలిపై హత్యాచారం కేసు పై కోల్‌కతాలోని సీల్దా కోర్టు శనివారం తీర్పు వెల్లడించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం అతడికి జనవరి 20న శిక్ష ఖరారు చేయనుంది.
గతఏడాది ఆగస్టు 9న రాత్రి ఆర్జీకర్ ఆసుపత్రి సెమినార్ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న ట్రైనీ డాక్టర్ పై హత్యాచార ఘటన జరిగింది. ఈ దుశ్చర్య యావత్ దేశాన్ని కదిలించింది. పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ విచారిస్తోంది.
ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో పేర్కొనలేదు. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్‌ను కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు.
కేసు విచారణలో భాగంగా ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఇన్ ఛార్జి అధికారి అభిజిత్ మండల్‌ను అరెస్టు చేసింది. సాక్ష్యాలు తారుమారుచేశారనే ఆరోపణలపై వారు ఇద్దరు అరెస్టు అయ్యారు. ప్రస్తుతం వారిద్దరికి బెయిల్ లభించింది.
సీబీఐ విచారణపై బాధితురాలి తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. సీబీఐ అధికారులు విచారణ పేరుతో చేసింది ఏమీలేదని అభిప్రాయపడ్డారు. నిందితులందరికీ శిక్ష పడినప్పుడే తమకు ఉపశమనం లభిస్తుందన్నారు.