బ్యాంకులు, బ్యాంకులు, డిపాజిట్లు స్వీకరించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. డిపాజిట్లకు తప్పనిసరిగా నామినీలు ఉండేలని తెలిపింది. ప్రస్తుత ఖాతాదారులకూ, కొత్త వారికీ దీన్ని పాటించాలని స్పష్టం చేసింది.
చాలా డిపాజిట్లు, లాకర్లకు నామీనీ పేర్లు లేవనే విషయం తమ దృష్టికి వచ్చిందన్న ఆర్బీఐ , ఖాతాదారుడు లేనప్పుడు నామినీ పేరు లేకుంటే డిపాజిట్లను తిరిగి తీసుకోవడం ఆయా కుటుంబాల్లోని వారికి ఇబ్బందిగా మారుతోందని వివరించింది.
నామినీ పేరు విషయంలో ఖాతాదారులను అప్రమత్తం చేసేలా సిబ్బందికి సూచించాలని తెలిపింది. మరణించిన ఖాతాదారులకు సంబంధించిన డిపాజిట్లను చెల్లించేందుకు నామినీలు, చట్టబద్ధమైన వారసులకు తగిన సహాయం చేయాలని పేర్కొంది.
బ్యాంకులు ఎప్పటికప్పుడు నామినేషన్ల గురించి సమీక్షించాలని, మార్చి 31 నుంచి ప్రతి మూడు నెలలకోసారి వివరాలను తెలియజేయాల్సిందిగా ఆర్‌బీఐ ఆదేశించింది. బ్యాంకులు డిపాజిట్ ఖాతాకు సంబంధించిన దరఖాస్తు పత్రంలో, నామినీ పేరు తెలియజేసేలా దరఖాస్తు పత్రాల్లో మార్పులు చేయాల్సిందిగా తేల్చి చెప్పింది.