దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. బీదర్‌లో ఏటీఎంలో నగదు నింపే వాహనం నుంచి 90 లక్షలు కాజేసిన ఘటన మరవక ముందే కర్ణాటకలో బ్యాంకు దోపిడీ కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
కర్ణాటకలోని మంగళూరు నగరంలో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. మంగళూరు కేపీరోడ్డులోని ఓ సహకార బ్యాంకులో దుండగులు తుపాకీలు చూపించి ఐదు నిమిషాల్లో 12 కోట్ల విలువైన ఆభరణాలు దోచుకెళ్లారు. ఓ వైపు నగరంలో సీఎం సిద్దరామయ్య పర్యటిస్తుండగానే దుండగులు దోపిడీకి పాల్పడటం సంచలనంగా మారింది. నీలి రంగు కారులో పరారైన దోపిడీ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు 12 బృందాలను ఏర్పాటు చేశారు. టోల్ గేట్ల వద్ద సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
బ్యాంకు సిబ్బందిలో ఒకరు ఇచ్చిన సమాచారంతోనే దొంగలు రెచ్చిపోయినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దొంగతనం జరిగే సమయంలో సీసీ కెమెరాల రిపేరు జరుగుతోందని పోలీసులు తెలిపారు. దొంగలు బెదిరింపులకు దిగిన సమయంలో బ్యాంకులో కేవలం ఐదుగురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. మిగిలిన ఆరుగురు ఏమయ్యారని ఆరాతీస్తున్నారు. బ్యాంకు సిబ్బందిలో ఒకరి సహకారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వెంటనే దొంగలను పట్టుకోవాలని విధాన సభ స్పీకర్ ఖాదర్ ఆదేశించారు.