విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి ఆమోదం తెలిపినట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ఆదుకునేందుకు కేంద్రం రూ.11440 కోట్లు వెంటనే ఇవ్వడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పలుసార్లు ప్రధాని మోదీకి విశాఖ ఉక్కు పరిశ్రమకు ఆర్థికసాయం చేయాలని కోరినట్లు ఆయన గుర్తుచేశారు.
విశాఖ ఉక్కు పరిశ్రమను ఆదుకునేందుకు రూ.11440 కోట్ల ఆర్థిక ప్యాకేజీకి క్యాబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. విశాఖ ఉక్కు పరిశ్రమకు ఉన్న అప్పులు తీర్చడంతోపాటు, గనుల సమస్యను కూడా పరిష్కరించనున్నట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఆగష్టు నాటికి మూడు ఫర్నేస్‌లు పనిచేస్తాయని ఆయన భరోసా ఇచ్చారు. పోర్టు ఆధారిత ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటామన్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ గత నాలుగేళ్లుగా తీవ్ర నష్టాల్లోకి జారిపోయింది. రూ.18 వేల కోట్ల నష్టాలతోపాటు, అప్పులు కూడా పెరిగిపోయాయి. గనుల సమస్యతో పాటు పెద్దఎత్తున వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో పరిశ్రమలో ఒక ఫర్నేస్ మూసివేశారు. ఏడాదికి 7.5 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో పనిచేయాల్సిన పరిశ్రమలో కేవలం 5 మిలియన్ టన్నులే ఉక్కు ఉత్పత్తి అవుతోంది. కేంద్రం తాజాగా ప్రకటించిన ప్యాకేజీతో ఉక్కు పరిశ్రమకు జీవపోయనున్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు.