144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళా త్రివేణీ సంగమ క్షేత్రం ప్రయాగరాజ్‌లో జనవరి 13నుంచీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటిరోజు పుష్య పూర్ణిమ, రెండవరోజు మకర సంక్రాంతి సందర్భంగా ఆ రెండురోజుల్లోనే ఐదు కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఆ మహాసంరంభం సందర్భంగా భారతదేశపు సుసంపన్నమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉత్తరప్రదేశ్ సాంస్కృతిక శాఖ ప్రతీరోజూ సాయంత్రం ‘సంస్కృతి కా సంగమ్’ పేరిట ప్రత్యేక సాంస్కృతిక మేళా నిర్వహిస్తోంది.
మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగరాజ్‌లోని గంగా పండాల్ దగ్గర ‘సంస్కృతి కా సంగమ్’ కార్యక్రమాన్ని ఆతిథ్య రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య జనవరి 16 గురువారం సాయంత్రం ప్రారంభించారు. ప్రపంచ ప్రఖ్యాత గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహాదేవన్ ‘చలో కుంభ్ చలే’ అనే అద్భుతమైన గీతంతో మొదలుపెట్టి శ్రోతల హృదయాలను రంజింపజేసే గానామృతాన్ని పంచిపెట్టారు.
జనవరి 16న మొదలైన ‘సంస్కృతి కా సంగమ్’ కార్యక్రమం ఫిబ్రవరి 24 వరకూ కొనసాగుతుంది. కైలాష్ ఖేర్, కవితా సేఠ్, హరిహరన్, నితిన్ ముఖేష్, సురేష్ వాడ్కర్, కవితా కృష్ణమూర్తి వంటి దేశంలోని గొప్పగొప్ప కళాకారులు ప్రతీ సాయంత్రం తమ ప్రతిభా పాటవాలతో ప్రేక్షకులను అలరిస్తారు. జానపద సంగీతం, శాస్త్రీయ నృత్యం, ఆధ్యాత్మిక గీతాలు, భజనలతో ప్రజలను రంజింపజేస్తారు.