ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ‘పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్’లో ఒకటైన బైగా గిరిజన తెగకు చెందిన ఆరుగురు వ్యక్తులకు అరుదైన అవకాశం దక్కింది. జనవరి 26న గణతంత్ర దినాన న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగే వేడుకలకు హాజరయ్యే అవకాశం వారికి లభించింది.
ఛత్తీస్‌గఢ్‌లో కబీర్ధామ్ (కావర్ధా) జిల్లా పండరియా బ్లాక్‌కు చెందిన పట్పరీ గ్రామానికి చెందిన ఫూల్సింగ్ బైగా, అతని భార్య జగ్తిన్‌బాయి బైగా, తేలియాపానీ గ్రామానికి చెందిన బలిబాయి బైగా, ఆమె భర్త సోనూరామ్ బైగా, తిత్రీబాయి బైగా, ఆమె భర్త బుధ్‌సింగ్ బైగా అనే ఆరుగురికీ రిపబ్లిక్ డే పెరేడ్ సందర్శనకు రావలసిందిగా రాష్ట్రపతి కార్యాలయం నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం అందింది.
రిపబ్లిక్ డే పెరేడ్ తర్వాత వారు దేశ రాజధానిలోని ప్రధానమైన ప్రదేశాలను సందర్శిస్తారు. పార్లమెంటు భవనం, ప్రధానమంత్రి నివాసం, ఇతర చారిత్రక ప్రదేశాల్లో పర్యటిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆతిథ్యమిచ్చే విందుకు కూడా హాజరవుతారు.
ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్ధామ్ చేరువలోని పట్పరీ, తేలియాపానీ గ్రామాల్లో 2024 అక్టోబర్ వరకూ కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేదు. ఇటీవలే జిల్లా కలెక్టర్ గోపాల్ వర్మ చొరవతో పట్పరీ గ్రామంలోని మొత్తం 25 గ్రామాలకూ సౌరవిద్యుత్ అందుబాటులోకి వచ్చింది.
అంతటి కుగ్రామాల్లో నివసించే తమకు దేశ రాష్ట్రపతి కార్యాలయం నుంచి గణతంత్ర దినోత్సవంలో పాల్గొనడానికి ఆహ్వానం రావడంతో ఆ ఆరు కుటుంబాల్లోనూ సంతోషం వెల్లివిరిసింది.