బంగ్లాదేశ్, మయన్మార్ మధ్య అతిపెద్ద అంతర్జాతీయ ఆయుధాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను మిజోరం పోలీసులు ఛేదించారు. కేంద్ర బలగాల నుంచి అందిన సమాచారం ఆధారంగా మిజోరం పోలీసులు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు లభించడంతో పాటు తిరుగుబాటు నాయకుడు కూడా అరెస్ట్ అయ్యాడు.
బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలకు చెందిన అక్రమ చొరబాటుదార్లు మిజోరంలో ఆయుధాల వాణిజ్యం చేస్తుండగా మిజోరం పోలీసులు పట్టుకున్నారు. మిజోరం రాష్ట్రం మామిత్ జిల్లా సైతా గ్రామంలో మయన్మార్‌కు చెందిన తిరుగుబాటు సంస్థ చిన్ నేషనల్ ఫ్రంట్ అగ్రనాయకుడు ఒకరిని నిర్బంధించారు. ఆ దాడిలో 6 ఏకే-47 రైఫిళ్ళు, 10,050 ఏకే సీరీస్ రైఫిల్ కార్ట్రిడ్జ్లు, 13 మ్యాగజైన్లు లభించాయి. ఈశాన్య భారతంలో ఇంత పెద్దస్థాయిలో ఆయుధాల స్మగ్లింగ్ రాకెట్‌ను పట్టుకోవడం దాదాపు ఇదే మొదటిసారి.
చిన్ నేషనల్ ఫ్రంట్ అనే సంస్థకు చెందిన అగ్రశ్రేణి నాయకుడిని కూడా నిర్బంధించినట్లు మిజోరం పోలీసులు వెల్లడించారు. చిన్ నేషనల్ ఫ్రంట్ అనేది మయన్మార్ కేంద్రంగా పనిచేస్తున్న తిరుగుబాటు సంస్థ. అయితే ఆ నాయకుడి వివరాలను మాత్రం వెల్లడించలేదు. బంగ్లాదేశ్‌కు చెందిన యునైటెడ్ పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్, మయన్మార్‌కు చెందిన చిన్ నేషనల్ ఫ్రంట్ మధ్య ఆయుధాల వ్యాపారం మిజోరంలో జరుగుతోంది. ఆ అక్రమ వ్యాపార లావాదేవీ గురించి కేంద్ర నిఘా సంస్థలు అందించిన సమాచారంతో మిజోరం పోలీసులు ఆ రాకెట్‌ను ఛేదించారు. భారత్-మయన్మార్ సరిహద్దుల వద్ద ఆయుధాల స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించడానికి దర్యాప్తు మొదలైంది.