ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ వెలగపూడిలోని సచివాలయంలో సమావేశమైన క్యాబినెట్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం,
మత్స్యకార భరోసా పథకాలు అమలు చేయాలని నిర్ణయించింది. పోలవరం కాపర్ డ్యాం నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుది. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లులేని పేదలకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
గ్రామ,వార్డు సచివాలయాల సిబ్బందిని మూడు విభాగాలుగా విభజించి అవసరమైన చోటుకు బదిలీ చేయాలని నిర్ణయించారు. కనీసం 2500 ప్రజలు ఉన్న గ్రామానికి ఒక సచివాలయం ఉంచి, అదనంగా ఉన్న వాటిని అవసరమైన చోటుకు మార్చాలని నిర్ణయించారు. అమరావతి రాజధాని పనులు కూడా వెంటనే ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
ఎన్నికల ముందు సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు ప్రతి పేదవారికి ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేయనున్నారు. నిషేధిత జాబితా నుంచి వైసీపీ ప్రభుత్వం 7 లక్షల ఎకరాలను తొలగించడంపై మంత్రుల కమిటీని వేయనుంది. అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేయాలని నిర్ణయించారు.