జమ్మూకశ్మీర్‌లో ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇటీవల నిర్మించిన 17 కిలోమీటర్ల కట్రా – రియాసీ సెక్షన్‌లో రైళ్ళు నడపడానికి కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (సిఆర్ఎస్) ఆమోద ముద్ర వేసారు. జమ్మూకశ్మీర్ రైల్వే నెట్‌వర్క్ విస్తరణలో ఇదొక కీలకమైన ఘట్టం.
శ్రీవైష్ణోదేవీధామ్ కట్రా నుంచి రియాసీ వరకూ రైళ్ళను గంటకు 85 కిలోమీటర్ల వేగంతో నడపడానికి సిఆర్ఎస్ ఆమోదించింది. లూప్‌లైన్లలో మాత్రం గంటకు 15 కిలోమీటర్ల వేగంతో నడపాల్సి ఉంటుంది. కట్రా నుంచి రియాసీ వరకూ లైన్ పూర్తవడంతో జమ్మూ, శ్రీనగర్ మధ్య వందేభారత్, డెము, మెము రైళ్ళు నడపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని రైల్వే శాఖలో ఒక సీనియర్ ఉద్యోగి వివరించారు.
కట్రా నుంచి రియాసీ వరకూ మార్గంలో ప్రయాణించే వందేభారత్ రైలును మైనస్ 20 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ అత్యల్ప ఉష్ణోగ్రతలను సైతం తట్టుకునేలా డిజైన్ చేసారు.
‘కశ్మీర్ లైన్’ అని పిలిచే ఈ ప్రాజెక్టుకు మొట్టమొదట 1994-95లో ఆమోదం లభించింది. జమ్మూను కశ్మీర్ లోయతో కలపడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు భౌగోళికంగా సంక్లిష్టమైనది. ఈ ప్రాజెక్టులో మొదటి మూడు దశలూ 2014కల్లా పూర్తయ్యాయి. ఫలితంగా కశ్మీర్ లోయలో బారాముల్లా నుంచి బనిహాల్ వరకూ రైళ్ళు నడుస్తున్నాయి. మరోవైపు జమ్మూ-ఉధంపూర్-కట్రా మధ్య రైళ్ళు నడుస్తున్నాయి. ఐతే కశ్మీర్ లోయలోని బనిహాల్ నుంచి జమ్మూ ప్రాంతం కట్రా వరకూ 111 కిలోమీటర్ల మార్గం చాలా సంక్లిష్టమైన మార్గం. ఆ మార్గం ఇప్పుడు దాదాపు పూర్తయింది. అందులో ఎన్నో ఇంజనీరింగ్ అద్భుతాలు ఉన్నాయి.
బనిహాల్-కట్రా సెక్షన్‌లో 97 కిలోమీటర్ల మార్గం టన్నెల్స్ ఉన్నాయి, 7 కిలోమీటర్లు బ్రిడ్జిలున్నాయి. వాటిలోనే చినాబ్ రైలుబ్రిడ్జి ఉంది. చినాబ్ నది మీద ఆర్చి బ్రిడ్జి ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెన. ‘‘ఆర్చి బ్రిడ్జికి పునాది వేయడం మేం ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్. రాక్ బోల్ట్ పద్ధతిలో 30వేల టన్నుల స్టీలు ఉపయోగించి నిర్మించాం’’ అని రైల్వేశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
బనిహాల్-కట్రా సెక్షన్‌లోనే అంజి నది మీద భారతదేశపు మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైల్వే బ్రిడ్జి నిర్మించారు. రియాసీ, బక్కల్ బ్రిడ్జిలు కూడా గమనించదగినవే. ఈ ప్రాజెక్టులో అతిపెద్ద టన్నెల్ ఏకంగా 12.77 కిలోమీటర్ల పొడవు ఉంది. మొత్తం 97 కిలోమీటర్ల పొడవున టన్నెల్స్ ఉన్నాయి. వాటిలో ప్రతీ 50మీటర్ల వద్దా కెమెరాలు అమర్చారు. ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా పలు ప్రాంతాల్లో మొత్తం 215 కిలోమీటర్ల రహదారులు కూడా నిర్మించారు.
ఈ మార్గంలో 8 బోగీల జమ్మూ-కశ్మీర్ వందేభారత్ రైలు ప్రయాణానికి సిఆర్ఎస్ అనుమతి మంజూరు చేసింది. హిమాలయాల చలిని తట్టుకునేలా వందేభారత్‌ను డిజైన్ చేసారు. సంక్లిష్టమైన బనిహాల్-కట్రా సెక్షన్ పూర్తి చేయడంతో జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాల మధ్య రైలు ప్రయాణం కార్యరూపం దాలుస్తోంది.