తిరువణ్ణామలై జిల్లా పరిశోధనా కేంద్రానికి చెందిన బృందం నాలుగు ప్రాచీన శిలా చిత్రలేఖనాలను (రాక్ పెయింటింగ్స్) కనుగొంది. మెగాలితిక్ కాలం నాటికి చెందిన ఆ చిత్రలేఖనాలు సుమారు 3 నుంచి 4వేల యేళ్ళ పురాతనమైనవి. తమిళనాడు విల్లుపురం జిల్లా కందాచిపురం దగ్గర కీల్వళై ఉదయనాథం దగ్గర ఈ శిలా చిత్రలేఖనాలను కనుగొన్నారు.
ఎస్ బాలమురుగన్, సి పళనిసామి, కె శరవణ కుమార్‌లతో కూడిన చరిత్ర పరిశోధనా కేంద్రం బృందం ఈ శిలా చిత్రలేఖనాలను కనుగొన్నారు. ఒక జలాశయం దగ్గర వాలుగా ఉన్న ఒక రాతి దిగువభాగంలో ఈ చిత్రలేఖనాలు ఉన్నాయని బాలమురుగన్ చెప్పారు.
రాక్ ఆర్ట్ నిపుణుడు డాక్టర్ కె.టి గాంధీరాజన్ ఈ పెయింటింగ్స్‌ను విశ్లేషించారు. వాటిలో మానవుల బొమ్మలు ఉన్నాయని గుర్తించారు. ఒక చిత్రంలో ఒక పురుషుడు చేయి పైకెత్తి ఉన్నాడని తెలిసింది. మరో బొమ్మలో ఒక వ్యక్తి తల వంచి ఉంది, జుత్తు ముఖం మీద పడుతోంది. చేతివేళ్ళు విప్పారి ఉన్నాయి. బహుశః ఆ వ్యక్తి నాట్యం చేస్తుండడమో లేక జంతువును పట్టుకునే ప్రయత్నించడమో చేస్తూండి ఉంటాడు.
ఆ మానవ రూపంతో పాటు రాతిమీద మరోమూల రెండు జింకల బొమ్మలున్నాయి. ఒక జింక కాళ్ళ కింద రెండు వృత్తాలు ఉన్నాయి. ఆ వృత్తాలు నీటిలో ప్రకంపనలు అయి ఉండవచ్చు, బహుశః ఆ జింకలు ఆ జలాశయం దగ్గర నీళ్ళు తాగడానికి వచ్చి ఉండొచ్చు. లేని పక్షంలో ఆ వృత్తాలకు గ్రహాలతో ఏమైనా సంబంధం ఉండి ఉండవచ్చని రాక్ ఆర్ట్ నిపుణుడు డాక్టర్ కె.టి గాంధీరాజన్ అభిప్రాయపడ్డారు. గతంలో మదురై జిల్లా తిరువత్తూరు దగ్గర కూడా ఇటువంటి చిత్రలేఖనాలను పరిశోధకులు కనుగొన్నారు.
మరో చిత్రలేఖనంలో ఒక వ్యక్తి నీటిలో పాక్షికంగా మునిగి ఉన్నట్లు ఉంది. బహుశః ఒక వ్యక్తి శరీరం పైభాగం నీటిలో మునిగినట్లుంది. అది ఏ జింకనో పట్టుకోడానికి పన్నిన ఉచ్చు కూడా అయి ఉండవచ్చునని గాంధీరాజన్ అంచనా వేసారు. ఆ చిత్రలేఖనాలన్నీ చాలా కచ్చితంగా, సరళమైన జ్యామితీయ నిష్పత్తులలో అత్యంత వాస్తవికంగా చిత్రించి ఉన్నాయని ఆయన విశ్లేషించారు. ఆ ప్రాచీన శిలా చిత్రలేఖనాలు భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలని, వాటిని పరిరక్షించుకోవాలనీ గాంధీరాజన్ సూచించారు.