ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
జనభా రేటు పెంచేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జనాభా పెంచే చర్యలకు ప్రొత్సాహకాలు ఇస్తామన్న ప్రభుత్వం, త్వరలో కొత్త చట్టం తెస్తామని సీఎం చంద్రబాబు తెలపారు. కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత కల్పించేలా చట్టం తెస్తామని ప్రకటించారు. ప్రభుత్వం ఏ పథకం అమలు చేయాలన్నా కుటుంబ పరిమాణాన్ని ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పారు.
సీఎం చంద్రబాబు గురువారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జనాభాను పెంచేందుకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. జనాభాను ఒకప్పుడు భారం అనే వాళ్లమని, కానీ ఇప్పుడది ఆస్తిలా మారిందన్నారు. గతంలో జనాభా నియంత్రణకు ప్రోత్సాహకాలు ఇచ్చేవాళ్లమన్న చంద్రబాబు, ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులను చేస్తూ గతంలో చట్టం తెచ్చినట్లు గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారడంతో కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే పోటీకి అర్హత కల్పిస్తామన్నారు.
2026 లో రాష్ట్రంలో ఒక జంటకు సగటున 1.51 మంది జన్మిస్తే , టోటల్ ఫెర్టిలిటీ రేట్ – టీఎఫ్ఆర్ 2051 నాటికి అది 1.07 తగ్గిపోతుందని పలు అంచనాల ద్వారా తెలుస్తోంది. ఒక జంటకు సగటున 2.1 మంది పిల్లలు జన్నిస్తేనే జనాభా సక్రమ నిర్వహణ సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.