వైట్‌హౌసుపై దాడి కేసులో భారత సంతతి వ్యక్తి సాయి వర్షిత్‌కు అమెరికాలోని కోర్టు 8 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 2023 మే 22న సాయి వర్షిత్ ఓ ట్రక్కు అద్దెకు తీసుకుని వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ నివాసంపై దాడికి తీవ్ర యత్నం చేశాడు. వైట్‌హౌసు సమీపంలో పాదచారుల దారిపై ట్రక్కును వేగంగా నడపడంతో జనం పరుగులు తీశారు. వైట్‌హౌసు సమీపంలోని భద్రతా సిబ్బందికి రక్షణగా ఉంచిన ఇనుప కంచెను ట్రక్కుతో ఢీ కొట్టాడని విచారణలో వెల్లడైంది. ఆ తరవాత ట్రక్కును వెనక్కుతిప్పి వైట్‌హౌసు గేటును ఢీ కొట్టే యత్నం చేసి అమెరికా అధ్యక్షుడిని హత్య చేసే కుట్రకు పాల్పడినట్లు న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.
భారత సంతతికి చెందిన సాయి వర్షిత్ నాజీ భావజాలంతో వైట్‌హౌసుపై దాడికి దిగినట్లు అభియోగాలు మోపారు. అమెరికా అధ్యక్ష భవనంపై దాడి చేసి బైడెన్‌ను చంపే కుట్రకు 6 నెలల ముందు నుంచే ప్రణాళిక వేసుకున్నట్లు జడ్జి తన తీర్పులో చెప్పారు. దాడికి యత్నం తరవాత సాయి వర్షిత్ నాజీల జెండాను రెపరెపలాడించినట్లు కేసు డైరీలో పేర్కొన్నారు. ఈ కేసును విచారించిన జడ్జి డాబ్రీ ఫెడ్రిచ్ సాయి వర్షిత్‌కు ఎనిమిళ్ల జైలు శిక్ష విధిస్తూ తాజాగా తీర్పు వెలువరించారు.