వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం సిద్ధమైంది. ఆర్థికంగా నష్టాల్లో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్)రక్షణకు కేంద్రం భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించనుంది.
ఒకటి రెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. రూ.11,500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్లుగా అనధికారిక సమాచారం. పూర్తి వివరాలను కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి శుక్రవారం వెల్లడించనున్నారు.
నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని గతంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. కనీస సామర్థ్యంతో పనిచేస్తుండడమే నష్టాలు పెరగడానికి ఓ కారణమని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. మిగతా ఉక్కు పరిశ్రమల మాదిరిగా సొంతంగా గనులు లేకపోవడమే విశాఖ స్టీల్‌ప్లాంట్ నష్టాలకు కారణమని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. సెయిల్‌లో విలీనం చేయాలని కూడా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యను పరిష్కరిస్తామని ఎన్నికల ముందు ఎన్డీయే హామీ ఇచ్చింది. వాగ్దానం మేరకు భారీ సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.