అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా వుంటూ అన్నివిధాలుగా ప్రోత్సహిస్తుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్న క్రీడాకారులు మరింత రాణించేందుకు రాష్ట్రంలో మరింత మెరుగైన సౌకర్యాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కల్పించనున్నారని శివనాథ్ చెప్పారు.
విశాఖపట్నానికి చెందిన టీమ్ ఇండియా క్రికెట్ ప్లేయర్ కె.నితీష్ కుమార్ రెడ్డి, ఏసీఏ అధ్యక్షుడు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్, ఏసీఏ కార్యదర్శి రాజ్యసభ ఎంపి సానా సతీష్‌లతో కలిసి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసారు.
తన తొలి టెస్ట్‌మ్యాచ్ లోనే సెంచరీ సాధించి రికార్డు సృష్టించిన నితీష్‌కుమార్ రెడ్డికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్ ప్రకటించిన రూ.25 లక్షల నగదు బహుమతిని చెక్కు రూపంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందజేసారు.
బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో సత్తా చాటిన తెలుగుతేజం నితీష్‌కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి అభినందించారు. అతని క్రికెట్ విశేషాలు అడిగి తెలుసుకున్నారు. నితీష్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రికెటర్ కె.నితీష్ కుమార్ రెడ్డికి త్వరలోనే ఇంటి స్థలం కేటాయిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఏసిఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏసీఏ ఉపాధ్యక్షుడు పి.వెంకట రామ ప్రశాంత్, కోశాధికారి దండమూడి శ్రీనివాస్, ఏసీఏ కౌన్సిలర్ దంతు గౌరు విష్ణుతేజ్, కె.ముత్యాలరెడ్డి పాల్గొన్నారు.