భారత ప్రభుత్వపు విద్యాశాఖ ఆధ్వర్యంలో ‘కాశీ తమిళ సంగమం’ కార్యక్రమం మూడో ఎడిషన్‌ను నిర్వహించడానికి ఐఐటీ మద్రాస్ సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 15 నుంచి 24వరకూ నిర్వహిస్తారు.
‘‘ప్రాచీన భారతదేశంలోని రెండు ప్రధానమైన విద్యా, సాంస్కృతిక కేంద్రాల మధ్య సౌహార్ద సంబంధాలను గురించి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. వివిధ రంగాలకు చెందిన ప్రజల మధ్య సంబంధాలను ఏర్పరచడం ద్వారా ఆ లక్ష్యం సుసాధ్యం అవుతుంది’’ అని ఐఐటీ మద్రాస్ ఒక ప్రకటనలో తెలియజేసింది.
కాశీ తమిళ సంగమం కార్యక్రమంలో పాల్గొనడానికి ఐదు కేటగిరీల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణ ప్రజలందరూ http://kashitamil.iitm.ac.in వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇచ్చేది వారణాసి లోని బనారస్ హిందూ యూనివర్సిటీ.
ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోటి ఈ కార్యక్రమం గురించి ఇలా వివరించారు. ‘‘తమిళనాడు నుంచి మొత్తం వెయ్యి మంది, ఐదు గ్రూపులుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వారిలో విద్యార్ధులు, ఉపాధ్యాయులు, రైతులు, హస్తకళాకారులు, వృత్తివిద్యా నిపుణులు, చిన్నచిన్న వ్యాపారవేత్తలు, మహిళలు, పరిశోధకులు ఇలా వివిధ రంగాలకు చెందినవారు ఉంటారు. ఇంకా, తమిళనాడులోని అన్ని కేంద్రీయ విద్యాలయాల నుంచీ ఎంపికయ్యే 200 మంది విద్యార్ధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వీరందరూ వారణాసి, ప్రయాగరాజ్, అయోధ్య తదితర ప్రదేశాలను సందర్శిస్తారు. ఈ యేడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ మహాకుంభమేళా కూడా జరుగుతోంది. దాంతో ఈసారి కాశీ-తమిళ సంగమం గొప్పగా ఉండబోతోంది’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారికి మహాకుంభమేళాలో షాహీ స్నాన్ (పవిత్ర స్నానం) చేసే అవకాశం, అయోధ్యలో నూతనంగా నిర్మించిన బాలరాముడి దేవాలయానని దర్శించే అవకాశం ఉండడం విశేషం.
ఈ యేడాది కాశీ తమిళ సంగమంలో… పూర్తి భారతీయమైన సిద్ధచికిత్సకు అగస్త్య మహర్షి అందించిన సేవలు, సంప్రదాయ తమిళ సాహిత్యం, దేశపు సాంస్కృతిక ఐకమత్యం అనేవి ప్రధానాంశాలుగా ఉండబోతున్నాయి. అగస్త్య మహర్షి ఈ ప్రపంచానికి అందించిన ఆరోగ్యశాస్త్రం, తత్వశాస్త్రం, విజ్ఞానశాస్త్రం, భాషాశాస్త్రం, సాహిత్యం, రాజనీతి, సంస్కృతి, కళలు వంటి వివరాలతో ఒక ప్రదర్శన నిర్వహిస్తారు. ఆ కార్యక్రమంలో భాగంగా సెమినార్లు, వర్క్‌షాపులు కూడా ఉంటాయి.
కాశీ-తమిళ సంగమం కార్యక్రమాన్ని కేంద్రప్రభుత్వం మొదటిసారి 2022 నవంబర్ 16 నుంచి డిసెంబర్ 16 వరకూ నిర్వహించింది. 2023 డిసెంబర్ 17 నుంచి 30వరకూ రెండోసారి నిర్వహించారు. ఇప్పుడు మూడోసారి నిర్వహిస్తున్నారు. ‘‘ఈ కార్యక్రమానికి తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ప్రజల నుంచి వస్తున్న స్పందన అద్భుతంగా ఉంది’’ అని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ తన ప్రకటనలో వివరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తమిళనాడు నుంచి వెళ్ళేవారు ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి పూర్వీకుల ఇల్లు, కేదార్ ఘాట్, కాశీ మండపాలను సందర్శిస్తారు. , బనారస్ హిందూ యూనివర్సిటీలోని తమిళ విభాగంలో విద్యా, సాహిత్య సంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.