పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలు భారత్‌ను అస్థిరపరిచే కుట్రలతో మరోసారి కొత్త సభ్యులను చేర్చుకుంటున్నాయి. ఆ ప్రక్రియలో భాగంగా యువ ముస్లిములను అతివాదులుగా మార్చేందుకు బాబ్రీ మసీదు అంశాన్ని వాడుతున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తున్నది ఫర్హతుల్లా గోరీ అనే ఉగ్రవాది. భారతదేశంలో రహదారులు, రవాణా సౌకర్యాల వంటి మౌలిక సదుపాయాలపై దాడులు చేయాలంటూ ఈమధ్య పిలుపునిచ్చిన ఉగ్రవాది ఇతనే.
ఇండియాటుడే కథనం ప్రకారం… పాకిస్తానీ ఉగ్రవాదులు ఒక ఆన్‌లైన్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో భాగంగా ఒక వెబ్‌సైట్‌ను కూడా రూపొందించుకున్నారు. భారత్‌లో హింసాకాండకు పాల్పడాలంటూ పాకిస్తానీ యువతను రెచ్చగొట్టడమే ఆ వెబ్‌సైట్ లక్ష్యం. అయోధ్యలో రామమందిరాన్ని కూలగొట్టాలి, బాబ్రీమసీదును మళ్ళీ నిర్మించాలి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను తుదముట్టించాలి, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాలి. ఇవీ ఆ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ప్రచారం చేస్తున్న అంశాలు. ఆ నెట్‌వర్క్ తన అజెండాను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ‘సిగ్నల్’ లాంటి ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్స్ వాడుతుండడం వల్ల ఈ ఉగ్రవాదుల కార్యకలాపాలను ట్రాక్ చేయడం సంక్లిష్టంగా మారింది.
ఇండియాటుడే కథనం ప్రకారం… భారతీయ ముస్లిములను ఉగ్రవాదులుగా మారేలా రెచ్చగొట్టే ఆ వెబ్‌సైట్‌ను 2024 డిసెంబర్ 3న ప్రారంభించారు. అందులో బాబ్రీమసీదును మళ్ళీ కట్టడాన్ని సమర్ధించే సందేశాలు, ఫర్హతుల్లా గోరీ ప్రచార వీడియోలూ ఉన్నాయి. అలాంటి ఒక వీడియోలో ఫర్హతుల్లా గోరీ రామమందిరాన్ని ధ్వంసం చేయడం గురించి ఇలా చెప్పాడు. ‘‘అల్లా కోరిక మేరకు, రామమందిరం ఏదో ఒకరోజు తునాతునకలైపోతుంది. ముస్లిములు కురాన్ బోధనల ప్రకారం నడుచుకోవాలి. భారతదేశంలో ఉగ్రవాద దాడులకు పాల్పడాలి. సోషల్ మీడియా పోస్టులతో ఏదీ మారదు’’.
మరో వీడియోలో ఇటీవల బెంగళూరులోని రామేశ్వరం కెఫేలో జరిగి ఉగ్రవాద దాడిని ఘనకార్యంగా కీర్తించడం కనిపిస్తుంది. ఇంకో వీడియోలో అయితే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటినుంచీ భారతదేశం మీద దాడులు చేయడం కష్టమైపోయిందని ఫర్హతుల్లా గోరీ ఒప్పుకున్నాడు కూడా.
2024లో ఆ వెబ్‌సైట్‌లో కేవలం ఉగ్రవాదులను రిక్రూట్ చేసుకోవడం కోసమే 19 వీడియోలు పెట్టారు. అంతేకాదు, ఆ వెబ్‌సైట్‌ను సందర్శించే వారిని సవుత్-అల్-హక్ అనే సిగ్నల్ గ్రూప్‌లో సభ్యులుగా చేరుస్తోంది. ఆ గ్రూప్‌లో 63 మంది సభ్యులు ఉగ్రవాదులుగా మారవలసిన అవసరం గురించి కొత్త సభ్యులకు బ్రెయిన్‌వాష్ చేస్తారు.
గోరీ గతంలో రైళ్ళను పేల్చడమే లక్ష్యంగా ప్రెషర్ కుక్కర్ల వంటి వస్తువులతో బాంబులు ఎలా తయారు చేయాలో మిలిటెంట్లకు శిక్షణనిస్తూ వీడియో విడుదల చేసాడు. ఆ ఫుటేజ్ భారతీయ భద్రతా బలగాలకు లభించింది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఐఎస్ఐ రక్షణలో బతుకుతున్న గోరీ వృత్తి, భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ ఉండడమే. ఇటీవల బెంగళూరు రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు, కొన్నేళ్ళ క్రితం గుజరాత్‌లో అక్షరధామ్ మందిరం మీద దాడి ఘటనలకు సూత్రధారి ఈ ఫర్హతుల్లా గోరీయే.