అధికారికంగా వెల్లడించిన విదేశాంగశాఖ
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవా సుబియాంటో భారత 76వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఇండోనేషియా అధ్యక్షుడు రిపబ్లిక్ వేడుకలకు హాజరవుతున్నట్లు వివరించింది. జనవరి 25, 26 తేదీల్లో భారత్ లో ప్రబోవా పర్యటిస్తారు
ప్రబోవా సుబియాంటో ఇండోనేషియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. ఈ పర్యటన ప్రాంతీయ, ప్రపంచ సమస్యలు చర్చించడానికి అవకాశాన్ని కల్పిస్తుందని విదేశాంగ శాఖ పేర్కొంది. సుబియాంటో ఇండోనేషియా రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు 2020లో దిల్లీని సందర్శించారు.
భారత్ 1950 నుంచి తన మిత్ర దేశాల అధినేతలను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానిస్తోంది. 1952, 53, 66ల్లో మాత్రమే విదేశీ అథితులు లేకుండా రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించారు. 2024లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ , 2023లో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా ఎస్-సిసిని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 2021, 2022 సంవత్సరాల్లో కరోనా కారణంగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు విదేశీ అతిథులను ఆహ్వానించలేదు.