మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ పోలీసులు హనీట్రాప్ గ్యాంగ్ నడుపుతున్న ఒక మహిళను మంగళవారం అరెస్ట్ చేసారు. నిందితురాలు రాణూ మాన్సురీ మీద ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆమెను పట్టుకున్నారు. ఒక యువకుణ్ణి పుట్టినరోజు వేడుకల పేరిట ఆమె హోటల్‌కు ఆహ్వానించింది. అక్కడ అతనికి డ్రగ్స్ ఇచ్చి, మత్తులో ఉండగా పోర్నోగ్రాఫిక్ వీడియో చిత్రీకరించిందని ఆ యువకుడు ఆమెపై ఫిర్యాదు చేసాడు.
పోలీసులకు బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం… రాణూ మాన్సురీ అతనికి డిసెంబర్ 25నుంచీ నిరంతరాయంగా ఫోన్లు చేస్తూనే ఉంది. ముఖ్యమైన పని ఉందనీ, నేరుగా కలవాలనీ చెబుతూ వచ్చింది. మొదట ఒక కాలేజీ దగ్గర కలిసింది. తర్వాత ప్రైవేటుగా మాట్లాడాలంటూ హోటల్‌కు పిలిచింది. బాధితుడు రాణూ మాన్సురీని జనవరి 4న పుష్పకమల్ హోటల్ వద్ద కలిసాడు. ఆరోజు తన పుట్టినరోజంటూ పార్టీ పేరిట హడావుడి చేసి అతన్ని డ్రగ్స్ మత్తులో ముంచింది. ఆ తర్వాత అతనితో పోర్నో వీడియో చిత్రీకరించారు. బాధితుణ్ణి మరొక వ్యక్తి ఫోన్‌కాల్స్, వాట్సాప్ ద్వారా బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేయసాగాడు. అడిగిన డబ్బులు ఇవ్వకపోతే వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తామంటూ బెదిరించాడు. దాంతో బాధితుడు జనవరి 9న కొత్వాలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు. ఒక ఇన్ఫార్మర్ సాయంతో పోలీసులు రాణూ మాన్సురీని బెర్చా ప్రాంతంలోని తన నివాసం దగ్గర అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి ఇంకా పరారీలోనే ఉన్నాడు.
పోలీసు విచారణలో రాణూ దగ్గర నకిలీ ఆధార్ కార్డు దొరికింది. ఆమె గతంలోనూ ఇలాంటి బెదిరింపు దందాలకు పాల్పడినట్లు తెలిసిన పోలీసులు, వాటి వివరాలు కూపీ లాగుతున్నారు. రాణూ దగ్గర రూ.3లక్షలకు ఒక చెక్, మధు అనే పేరుతో ఒక నకిలీ ఆధార్ కార్డు దొరికాయి. ఆ కార్డులో ఆమె ఇందోర్‌కు చెందిన దినేష్ అగర్వాల్ కుమార్తె అని ఉంది. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగు చూసాయి.
నిందితురాలి అసలు పేరు రాణు. 26 ఏళ్ళ రాణు, బెర్చా ప్రాంతానికి చెందిన షకూర్ ఖాన్ కూతురు. ధనవంతులైన యువకుల వివరాలు సేకరించేది. వారిని ట్రాప్ చేసి, మత్తులోకి నెట్టి వారి అసభ్య వీడియోలు చిత్రీకరించేది. తర్వాత వారిని బ్లాక్‌మెయిల్ చేసి లక్షల రూపాయలు వసూలు చేసేది. ఈ నేరాల్లో ఆమెకు ఇందర్ గుర్జార్ అనే వ్యక్తి సహకరించే వాడు. ప్రస్తుతానికి అతనింకా పోలీసులకు పట్టుబడలేదు.
పోలీసులు రాణు మాన్సురీ నుంచి నేరానికి ఉపయోగించిన సెల్ ఫోన్‌తో పాటు మరో 9 సెల్‌ఫోన్లు, రూ.2లక్షల నగదు, ఒక రహస్య వెబ్‌కెమెరా స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.