ఎన్నికల ప్రచారంలో ఏఐ వినియోగం పై రాజకీయపార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం అడ్వైజరీ జారీ చేసింది. తప్పుడు కంటెంట్ తో ఓటర్ల అభిప్రాయాలను మార్చే అవకాశం ఉండటంతో ఎన్నికల కమిషన్ అప్రమత్తమైంది.
ఎన్నికల ప్రచారంలో వినియోగిస్తున్న కంటెంట్ పారదర్శకంగా ఉండాలన్న ఈసీ, అభ్యర్థులు జవాబుదారీతనంతో వ్యవహరించాలని అడ్వైజరీలో పేర్కొంది. టెక్నాలజీ ద్వారా క్రియేట్ చేసిన ఆడియో, వీడియో, చిత్రాలపై ఏఐ జనరేటెడ్, సింథటిక్ కంటెంట్ వంటి సంకేతాలను లేబుల్ చేయాలని తెలిపింది. ప్రచార ప్రకటనలను వ్యాప్తి చేసే సమయంలో సింథటిక్ కంటెంట్ వినియోగించినా దానికి డిస్క్లైమర్స్ ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీలు ఏఐని వినియోగిస్తున్నాయి. దీనిలో భాగంగా నకిలీ కంటెంట్ ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. ఏఐ ద్వారా కలిగే నష్టాల గురించి ఇటీవల ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ కూడా హెచ్చరించారు.