ఒడిషా భువనేశ్వర్‌లోని ప్రఖ్యాత లింగరాజస్వామి దేవాలయంలో సేవాయత్‌లలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ కారణంగా స్వామికి సోమవారం అంటే భోగి పండుగ రోజు నుంచీ పూజలు, నైవేద్యాలు నిలిచిపోయాయి. బడూ నిజోగ్, మహాసువారా నిజోగ్ సేవాయత్‌ల (సేవకుల) మధ్య మకర సంక్రాంతి సంప్రదాయాల విషయంలో విభేదాలు తలెత్తాయి. ఏ వర్గమూ తగ్గకపోవడంతో భోగ్ (నైవేద్యం) సహా అన్ని పూజలూ నిలిపివేసారు.
మకర సంక్రాంతి సందర్భంగా లింగరాజస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజాదికాలు మూడు రోజులు నిర్వహించడం ఆనవాయితీ. ఆ ఆచారాలు మకర సంక్రాంతి రోజు ‘పుష్యాభిషేక సంధ్యాధూపం’ కార్యక్రమంతో మొదలవుతాయి. అందులో భాగంగా దైవమూర్తిని గర్భగుడి నుంచి బైటకు తీసుకొచ్చి ఆలయం ఆవరణలోని మకర మంటపంలో నిలుపుతారు. సంక్రాంతి రోజున మకర ఘృతం లేక ఘృత కమలం స్వామికి అర్పిస్తారు. ఆ సంప్రదాయాన్ని ఘృత కమల లాగీ అంటారు. దానికోసం బడూ సాహీ వంశానికి చెందిన కొన్ని నిర్దిష్టమైన సామంత్ర కుటుంబాల నుంచి పాలు సేకరిస్తారు, ఆ పాలతో తయారుచేసిన నేతిని మాత్రమే ఉపయోగిస్తారు.
పాలు కాచి నేతిని చేసే ప్రక్రియను బడూ నిజోగ్ కుటుంబాలు పూర్తి చేస్తాయి, ఆ నేతితో కూడిన ఘృత కమలాన్ని బడూ నిజోగ్, మహాసువారా నిజోగ్ కుటుంబాలు స్వామికి అర్పిస్తాయి. అయితే ఈ సోమవారం నాడు, ఘృత కమల సంప్రదాయాన్ని తాము మాత్రమే చేస్తామని, మహాసువారా సేవకులు ఉండరాదంటూ బడూ నిజోగ్ సేవకుల కుటుంబాలు పట్టుపట్టాయి. దాన్ని వ్యతిరేకిస్తూ మహాసువారా కుటుంబాలు నిరసన వ్యక్తం చేసాయి. ఫలితంగా పుష్యాభిషేక సంధ్యాధూపం తర్వాత ఘృత కమల సేవ నిలిచిపోయింది. స్వామి మకర మంటపంలో కూర్చున్నా ఆయనకు ఘృత కమల సేవ జరగలేదు. భక్తులకు దర్శనాలకు అనుమతి ఇచ్చారు కానీ స్వామికి సేవలు నిలిచిపోయాయి.
ఆలయ యాజమాన్యం వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించింది కానీ ఏ వర్గమూ వెనక్కు తగ్గడానికి సిద్ధంగా లేదు. ఒడిషా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్, దేవదాయ శాఖ కమిషనర్, ఖుర్దా జిల్లా కలెక్టర్ చంచల్ రాణా, న్యాయశాఖ కార్యదర్శి, స్థానిక ఎంఎల్ఎ, బడూ నిజోగ్ సేవాయత్‌లతో ఒక ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కానీ ఫలితం ఏమీ లేదు. బుధవారం మళ్ళీ ఇరువర్గాలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు.
కలెక్టర్ చంచల్ రాణా, విధులకు వెంటనే హాజరవ్వాలంటూ సేవాయత్‌లను ఆదేశించారు. జరిగిన సంఘటనపై 24 గంటల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలంటూ అదనపు కలెక్టర్‌ను ఆదేశించారు. సోమవారం రాత్రి నుంచీ స్వామికి సేవలు నిలిచిపోవడానికి కారణమైన సేవాయత్‌లపై ట్రస్ట్‌బోర్డ్ కఠినమైన చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఆలయ సత్వలిపిని (గుడిలో హక్కుల రికార్డులను) సవరిస్తామని వెల్లడించారు.
ఈ వివాదం కారణంగా లింగరాజస్వామి నాలుగు రోజుల పాటు పస్తులున్నాడంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేసారు.