అదానీ గ్రూపు కంపెనీలపై సంచలన ఆరోపణలు చేసి స్టాక్స్ పతనానికి కారణమైన హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థను మూసివేస్తున్నట్లు వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ ప్రకటించారు. ఈ సంస్థపై మొదటి నుంచి అనేక ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా ఒక సంస్థను లక్ష్యంగా చేసుకుని ఆ సంస్థలో అవకతవకలు జరిగాయంటూ వార్తలను ప్రాచుర్యంలోకి తీసుకొస్తారు. అప్పటికే పెద్ద ఎత్తున ఆ సంస్థకు చెందిన షేర్లు కొనుగోలు చేసి, తప్పుడు కథనాల ప్రచారం చేయడం ద్వారా స్టాక్స్ ధర తగ్గగానే షార్ట్ సెల్లింగ్‌నకు పాల్పడుతుంటారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
తనకు ఎలాంటి బెదిరింపులు లేవని, అనుకున్న లక్ష్యం సాధించినట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు నాథన్ అండర్సన్ వెల్లడించారు. ఏడాది కాలంగా హిండెన్ బర్గ్ మూసివేతపై చర్చలు సాగినట్లు చెప్పుకొచ్చారు. ఈ సంస్థను ఎక్కువకాలం కొనసాగిస్తే తప్పుడు మార్గాలకు దారులు వేసినట్లు అవుతుందని అందుకే మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
రెండేళ్ల కిందట అదానీ గ్రూపు సంస్థ కృత్రిమంగా షేర్ల ధరలను పెంచిందని, వాటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వేల కోట్లు అప్పులు తెచ్చారంటూ హిండెన్ బర్గ్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆరోపణల తరవాత అదానీ కంపెనీ షేర్ల విలువలో రూ.6 లక్షల కోట్లకు కోత పడింది. మదుపరులు భారీగా నష్టపోయారు.హిండెన్ బర్గ్ పెద్ద ఎత్తున షార్ట్ సెల్లింగునకు పాల్పడి కోట్లాది రూపాయల సంపద కొల్లగొట్టిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.