ఆసియాలోనే అతిపెద్ద సోలార్ పార్క్ కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ సన్ టెక్ ముందుకు వచ్చింది. కర్నూలు జిల్లాలో రెండు ప్రాంతాలను రిలయన్స్ ప్రతినిధులు పరిశీలించారు. ఏదో ఒక ప్రాంతంలో సోలార్ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆసియాలో అతిపెద్ద సోలార్ ఎనర్జీ పార్క్తోపాటు, బ్యాటరీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నారు.
దాదాపు రూ.7 వేల కోట్ల పెట్టుబడితో 2 వేల మెగావాట్ల సోలార్ ప్లాంట్ కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. బీవోటీ పద్దతిలో ఈ ప్లాంటు రానుంది. 25 సంవత్సారాల పాటు విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందం చేసుకోనున్నారు. దీని ద్వారా మొదటి ఫేజ్లో 1100 మందికి ప్రత్యక్షంగా, 5 వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పించనున్నారు. ఇందుకు అవసరమైన పెట్టుబడులు రిలయన్స్ సన్ టెక్ సమకూర్చుకోవాల్సి ఉంది. ఇక్కడ ఉత్పత్తి చేసిన కరెంటును బహిరంగ మార్కెట్లో సెకీ వేలం వేయనుంది.