ఇజ్రాయెల్, హమాస్ మధ్య 15 నెలలుగా జరుగుతున్న యుద్ధానికి అడ్డుకట్టపడింది. తాత్కాలికంగా కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయి.ఇరువర్గాల మధ్య ఒప్పందంతో గాజాకు ఊరట కలగనుంది. ఖతార్ రాజధాని దోహాలో వారాల తరబడి జరిగిన చర్చల తర్వాత బుధవారం నాడు శాంతి ఒప్పందం ప్రకటన వెలువడింది. ఒప్పందంలో భాగంగా కనీసం ఆరు వారాల పాటు యుద్ధానికి విరామం ప్రకటించనున్నారు.
తాత్కాలిక విరామ సయంలోనే యుద్ధానికి పూర్తిగా తెర దించే ప్రయత్నాలను ముమ్మరం చేయనున్నారు.
హమాస్, తమ దగ్గర బందీలుగా ఉన్న వందమంది ఇజ్రాయెలీల్లో 30 మందికి పైగా విడతలవారీగా వదిలేయాల్సి ఉంది. ఇందుకు బదులుగా వందలాది మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలని ఒప్పందం కుదిరింది.
యుద్ధం కారణంగా గాజాలో నిర్వాసితులైన వేలాది మంది స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు అంతర్జాతీయ మానవతా సాయాన్ని పూర్తిస్థాయిలో అనుమతించాలి. ఈ మేరకు ఇరు వర్గాలూ అంగీకరించాయి. ఒప్పందంపై దోహా నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఒప్పందం విధివిధానాలు ఇంకా ఖరారు కావాల్సి ఉందని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం తెలిపింది. కేబినెట్ ఆమోదించాల్సి ఉందని స్పష్టం చేసింది.
తాను ప్రమాణస్వీకారం చేసే లోపే గాజాలో యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్‌కు వార్నింగ్ ఇచ్చారు. అందుకే ఈ ఒప్పందం జరిగిందని కూడా కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.