కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం నాడు బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై మళ్ళీ తాజాగా ఆరోపణలు చేసారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలోని దాదాపు ప్రతీ జాతీయ సంస్థనూ ఆక్రమించేసుకున్నాయని ఆరోపించారు. ఆ క్రమంలో రాహుల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేవలం బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ల మీదనే కాదు, భారతదేశానికే వ్యతిరేకంగా పోరాడుతోందంటూ సంచలన ప్రకటన చేసారు.
‘‘మేము సరైన యుద్ధం పోరాడుతున్నాం అనుకోకండి. మేము బీజేపీ అనే రాజకీయ సంస్థతోనూ, ఆర్ఎస్ఎస్‌తోనూ పోరాడుతున్నాం. వారు దేశంలోని దాదాపు ప్రతీ వ్యవస్థనూ స్వాధీనం చేసుకున్నారు. మేమిప్పుడు కేవలం బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లతో పోరాడడం లేదు. మొత్తం భారతదేశంతోనే యుద్ధం చేస్తున్నాం’’ అని రాహుల్ గాంధీ అన్నారు. దేశ రాజధానిలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కొత్త ప్రధాన కార్యాలయ భవనం ప్రారంభోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
ఇటీవల జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల మీద కూడా రాహుల్ అవిశ్వాసం ప్రకటించారు. ఆ ఎన్నికల్లో ఏదో తేడా జరిగింది అని వ్యాఖ్యానించారు. ‘‘ఎన్నికల కమిషన్ పనిచేసే విధానంతో మేము అసౌకర్యంగా ఉన్నాము. లోక్‌సభ ఎన్నికలకు, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకూ మధ్య సుమారు కోటిమంది కొత్త ఓటర్లు వచ్చారు. అది పెద్ద సమస్య. శాసనసభ ఎన్నికల్లో ఓట్లు వేసిన వారి పేర్లు చిరునామాలతో ఓటర్ల జాబితాను ఇవ్వాలి. అది ఎన్నికల సంఘం విధి. కానీ ఆ సమాచారం ఇవ్వడానికి ఈసీ నిరాకరించింది’’ అని ఆయన ఆరోపించారు. విచిత్రం ఏంటంటే ఎన్నికల్లో ఓట్లు వేసిన వాళ్ళ పేర్లతో పాటు వారి చిరునామాల జాబితా కూడా రాహుల్ గాంధీకి ఇవ్వాలట. అది ఎన్నికల సంఘం అధికారిక విధుల్లో భాగమని చెబుతుండడం మరీ విచిత్రం.
‘‘ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఎందుకు పారదర్శకంగా ఉంచదు? ఆ జాబితాను మనకు ఎందుకు ఇవ్వదు? వాళ్ళు ఎందుకు జాబితాను దాచుకుంటున్నారు? అలా ఎందుకు చేస్తున్నారో వివరించడం వారి పవిత్ర బాధ్యత’’ అని రాహుల్ ఎన్నికల సంఘానికి సుద్దులు చెప్పారు.
రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్‌ను గోప్యంగా వ్యవహరించే సంస్థ అని, అధికార పక్షం కేవలం ఒక్క వ్యక్తే ఈ దేశాన్ని పరిపాలించాలని కోరుకుంటోందనీ వ్యాఖ్యానించారు. ‘‘ఇది మన ఆలోచనకు, ఆర్ఎస్ఎస్ ఆలోచనకూ మధ్య పోరు. మన ఆలోచన ప్రకారం భారత్ కొన్ని రాష్ట్రాల సముదాయం. ఇందిరా భవన్‌లో అన్ని భారతీయ భాషలూ ప్రదర్శిస్తారు. అంటే ఈ దేశంలో ఏ ఒక్క భాషా గొప్పది కాదు, ఏ ఒక్క సంస్కృతీ గొప్పది కాదు’’ అన్నారు.
రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఎన్నికల సంఘాలపై దాడి చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. కాంగ్రెస్ గతంలో ఎన్నికల కమిషన్ మీద చాలాసార్లే దాడులు చేసింది. ప్రత్యేకించి ఎన్నికలు ఓడిపోయిన సందర్భాల్లో ఈసీని దారుణంగా దూషించింది. రాహుల్ గాంధీకి ఈవీఎంలపైనా, భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ పైనా నమ్మకం లేదు. విచిత్రమేమంటే తమ పార్టీ లేదా తమ మిత్రపక్షాలు గెలిచిన సందర్భాల్లో మాత్రం ఆ ఆరోపణలేవీ గుర్తుకురావు.