యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మూడు హిందూ కుటుంబాలకు న్యాయం చేసింది. 1978 హిందూ వ్యతిరేక ఘర్షణల్లో నిరాశ్రయులైన శంభల వాసులకు వారి భూమిని తిరిగి వెనక్కు ఇప్పించింది. ఆనాటి ఘర్షణల్లో బాధితులు తమ కుటుంబ సభ్యులను భౌతికంగా కోల్పోయారు, తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తిని మరో మతం వారు అన్యాయంగా ఆక్రమించుకుని తరిమేస్తే గతిలేక పారిపోయారు. అలా దారుణ హత్యలకు గురై, భయంకరంగా తరిమివేయబడిన కుటుంబాలకు 47ఏళ్ళ తర్వాత న్యాయం లభించింది.
సంభాల్‌లో 1978లో జరిగిన ఘర్షణలు యూపీ మతహింస చరిత్రలో ఓ విషాద అధ్యాయం. సుమారు 250 మంది హిందువులను అమానుషంగా ఊచకోత కోసారు. వారి కుటుంబాలతో పాటు, ఆ ప్రాంతంలో మిగిలిన హిందూ కుటుంబాలను బలవంతంగా తరిమేసారు. కొన్నాళ్ళకు ప్రాణాలు ఉగ్గబట్టుకుని తమ బతుకులు గడపడం కోసం తమ భూములు, ఆస్తులను స్వాధీనం చేసుకోడానికి ప్రయత్నించిన హిందువులను అమానుషంగా హింసించి వెనక్కు పంపేసారు. తాము ఆక్రమించుకున్న భూముల్లో వ్యూహాత్మకంగా నిర్మాణాలు చేపట్టారు. తద్వారా వాటిని ఇంకెవరూ తాకలేరని భావించారు. అయితే ఇప్పుడు కథ మారుతోంది. తమ ఆస్తులు తమకు ఇప్పించాలంటూ మూడు కుటుంబాలు ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. వారికిప్పుడు న్యాయం జరిగింది. దీన్ని చూసి మిగతా వారు ముందుకు వచ్చే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
1978 హిందూ వ్యతిరేక ఘర్షణల్లో నష్టపోయినవారిలో తులసీరామ్‌ది ఒక విషాద గాధ. అతను హిందూ దళితుడు. అతన్ని అమానుషంగా ఊచకోత కోసి చంపేసారు. ఆ భయంతో అతని కుటుంబం అక్కణ్ణుంచి పారిపోయింది. జగత్ మొహల్లా అనే ప్రదేశంలోని హిందూ కుటుంబాలన్నీ పరారైపోయాయి. వారిలో తులసీరామ్ కుటుంబం కూడా ఉంది. నాలుగున్నర దశాబ్దాలకు పైగా నిరాశ్రయులుగా శరణార్థులుగా బతికిందా కుటుంబం. వారి భూమిని ముస్లిములు అక్రమంగా ఆక్రమించుకున్నారు. అంతేకాదు, అక్కడ వ్యూహాత్మకంగా ఒక పాఠశాల కట్టేసుకున్నారు. దాంతో తమ భూమిని తిరిగి పొందడానికి తులసీరామ్ కుటుంబం చేసిన ప్రయత్నాలు నేటివరకూ ఏమాత్రం ఫలించకుండా పోయాయి.
తులసీరామ్ కుటుంబ వారసుడు, తమ భూమి కోసం ఫిర్యాదు చేసిన అమ్రీష్ కుమార్ తమ విషాద కథను వివరించాడు. ‘‘1978 అల్లర్లలో మా తాతను చంపేసారు. మా ఇంటిని, మా భూములను, మా జీవనాధారాన్నీ వదిలిపెట్టేసి పారిపోయాం. అంతకంటె మాకు గత్యంతరం లేదు. కొన్నాళ్ళకు మేం మళ్ళీ వెనక్కు రావడానికి ప్రయత్నించాం. కానీ వాళ్ళు తరిమేసారు. ఇక్కడ మాకు ఇంకెంతమాత్రం చోటు లేదని చెప్పారు. మా ఆస్తిని వెనక్కు తీసుకోడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. శంభలలో ఘర్షణలు జరిగేవరకూ మేమంతా కలిసి హాయిగా బతికాం. కానీ మా జీవితాలు ఒక్క క్షణంలో కుప్పకూలిపోయాయి. మా సమస్తాన్నీ వదిలిపెట్టి పరుగులు తీయాల్సి వచ్చింది. కొన్ని దశాబ్దాలుగా మా భూమి వైపు కన్నెత్తలేకపోయాం. కానీ ఇవాళ మాకు న్యాయం జరిగింది. మా భూమి ఎట్టకేలకు మాకు దక్కింది’’ అని అమ్రీష్ కుమార్ చెప్పాడు.
బాధిత కుటుంబాలు గత నాలుగు దశాబ్దాల్లో శంభల జిల్లా కలెక్టరేట్‌కు పదులసార్లు ఫిర్యాదు చేసాయి. ఆ భూమిపై తమ చట్టబద్ధమైన యాజమాన్యాన్ని నిరూపించే పత్రాలు అన్నింటినీ సమర్పించారు. ‘‘కానీ ఇన్నేళ్ళలో ఎన్నడూ మా ఫిర్యాదులను కనీసం వినలేదు. ఇప్పుడు, ఇన్ని దశాబ్దాల నిరీక్షణ తర్వాత మాకు న్యాయం జరుగుతోంది’’ అని అమ్రీష్ కుమార్ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.
మరో ఫిర్యాది ఆశాదేవి తన బాధామయ గతాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘1978 అల్లర్లలో మా భూమిని వదిలి పోవలసి వచ్చింది. మాకు బస్ స్టేషన్ వెనుక 2.25 బిఘాల భూమి ఉండేది. దాన్ని వాళ్ళు లాగేసుకున్నారు. అక్కడ బడి కట్టేసుకున్నారు. న్యాయంగా మాదైన దాన్ని తిరిగి తీసుకోవాలని ప్రయత్నించిన ప్రతీసారీ మమ్మల్ని తరిమేసారు. మా బాధలను వ్యవస్థ ఏనాడూ పట్టించుకోలేదు అనిపించేది.’’
కొన్నాళ్ళ క్రితం మళ్ళీ ఫిర్యాదు చేసాక, సంభాల్ జిల్లా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ వందనా మిశ్రా నేతృత్వంలో అధికార యంత్రాంగం వేగంగా పనిచేసింది. రెవెన్యూ విభాగం సమగ్ర సర్వే నిర్వహించింది. మొత్తం 15వేల చదరపు అడుగుల్లో 10వేలకు పైగా చదరపు అడుగుల భూమి అక్రమంగా ఆక్రమించుకున్నదేనని తేలింది. డాక్టర్ షెవాజ్ అనే ముస్లిం వ్యక్తి ఎలాంటి డాక్యుమెంట్లూ లేకుండా, ఎలాంటి చట్టపరమైన అనుమతులూ లేకుండా పాఠశాల కట్టేసుకున్నారని నిర్ధారణ అయింది. ‘‘ఆ భూమి ఫిర్యాదుదారులకు చెందినదే అని మేం ధ్రువీకరించుకున్నాం. స్కూల్ మేనేజర్ తన యాజమాన్యాన్ని నిరూపించగల రిజిస్ట్రేషన్ డీడ్ ఏదీ చూపలేకపోయారు. దాంతో ఆ భూమిని దాని హక్కుదారులకు తిరిగి ఇచ్చేసాం’’అని వందనా మిశ్రా చెప్పారు.
భూమిని అసలైన యజమానులకు తిరిగి అప్పగించే ప్రక్రియ పటిష్ట భద్రత నడుమ జరిగింది. ఎలాంటి గొడవలూ జరక్కుండా పోలీసులు మోహరించారు. దీంతో తరిమివేయబడిన కుటుంబాలకు ఊరట లభించడం ఒక ఫలితమైతే, భూమి ఆక్రమణలు, మతపరమైన ఉద్రిక్తతల గురించిన ప్రశ్నలు మళ్ళీ తలెత్తుతున్నాయి. మిగతా 5వేల చదరపు అడుగుల భూమి ఎవరిదో ఇంకా తెలియలేదు. దాన్నిబట్టే ఇంకా ఎన్ని కుటుంబాలకు చెందిన ఎన్ని భూముల ఆక్రమణ కేసులున్నాయో, ఎన్ని కుటుంబాలు తమ హక్కులను కోల్పోయి మౌనంగా రోదిస్తున్నారో సులువుగా అంచనా వేయవచ్చు.
ఆక్రమణల తొలగింపు ప్రక్రియకు అధికారులు ఇది ప్రారంభం మాత్రమే అంటున్నారు. ‘‘భూములు అక్రమంగా ఆక్రమించుకున్న కేసులు చాలా ఉన్నాయని మాకు తెలుసు. అలాంటి ఆస్తులను గుర్తించి, వివాదాలను పరిష్కరించడానికి జిల్లా యంత్రాంగం క్రియాశీలంగా పనిచేస్తోంది. రాబోయే రోజుల్లో మరెంతో మంది ముందుకు వస్తారని, ఇలాంటి ఫిర్యాదులు చేస్తారనీ ఆశిస్తున్నాం’’ అని ఒక సీనియర్ అధికారి అన్నారు.
1978 హిందూ వ్యతిరేక ఘర్షణల బాధితులకు ఈ గెలుపు కేవలం భూమిని తిరిగి సొంతం చేసుకోవడంలో విజయం కాదు. తమ ఆత్మగౌరవాన్ని, తాము పోగొట్టుకున్న న్యాయాన్నీ మళ్ళీ పొందడమే. ఈ యుద్ధం ఇంకా పూర్తిగా ముగియలేదన్న మాట నిజమే. కానీ చిరకాలంగా అన్యాక్రాంతమైపోయిన భూములను మళ్ళీ స్వాధీనం చేసుకోవడం సాధ్యమే అని ఓ కొత్త ఆశ చిగురించిన సందర్భమిది. న్యాయం కోసం తాము చేసే పోరాటంలో ప్రభుత్వం సైతం కలిసివస్తుందనే విశ్వాసం వికసించిన సందర్భమిది. మిగతా భూముల గురించి దర్యాప్తు ఇంకా జరగాల్సి ఉంది. అయితే భూముల ఆక్రమణ గురించి, అక్కడి మత రాజకీయాల స్థితిగతుల గురించీ ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి.