ఢిల్లీ మద్యం విధానం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను ప్రోసిక్యూట్ చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి కేంద్ర హోంశాఖ అనుమతించింది. లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ జరిగిందని, ఆ లాండరింగ్‌లో కేజ్రీవాల్, సిసోడియాల ప్రమేయం ఉందనీ ఆరోపణలున్నాయి.
2021-22 నాటి లిక్కర్ పాలసీలో అవకతవకల ఆరోపణల విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను ప్రోసిక్యూట్ చేయడానికి హోంశాఖ తాజాగా అనుమతి మంజూరు చేసింది. ఇదే కేసుకు సంబంధించి అరెస్టయిన మనీష్ సిసోడియాకు గత ఆగస్టులోనూ, అరవింద్ కేజ్రీవాల్‌కు గత సెప్టెంబర్‌లోనూ బెయిల్ మంజూరయింది. ఇప్పుడు వారిద్దరినీ ప్రోసిక్యూట్ చేయడానికి హోంశాఖ అనుమతించడం విశేషం.
మొదట ట్రయల్ కోర్టు అరవింద్ కేజ్రీవాల్‌పై దాఖలు చేసిన ఛార్జిషీటును అనుమతించింది. దాన్ని కేజ్రీవాల్ సవాల్ చేసారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ప్రోసిక్యూషన్ కోసం ప్రత్యేక అనుమతి లేకుండా తనపై చార్జిషీట్ ఎలా దాఖలు చేస్తారంటూ ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని కేజ్రీవాల్ సవాల్ చేసాడు. ఫలితంగా ఢిల్లీలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు కేజ్రీవాల్‌పై ఆరోపణలను నమోదు చేయడాన్ని వాయిదా వేసింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఆ చట్టం ప్రకారం కేజ్రీవాల్, సిసోడియా ఇద్దరినీ ప్రోసిక్యూట్ చేయడానికి కేంద్ర హోంశాఖ అనుమతించడం విశేషం.
ఇదే కేసుకు సంబంధించి సీబీఐ అరవింద్ కేజ్రీవాల్ మీద అవినీతి నిరోధక చట్టం ప్రకారం చార్జిషీటు ఫైల్ చేసింది. ఆ కేసులో కేజ్రీవాల్‌ను ప్రోసిక్యూట్ చేయడానికి కావలసిన అనుమతులు గతేడాది ఆగస్టులోనే మంజూరయ్యాయి.
ఈ కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటివరకూ ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబై సహా దేశవ్యాప్తంగా 245 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ సహా డజనుకు పైగా వ్యక్తులను అరెస్ట్ చేసింది.