ఐఐటీ మద్రాస్ పరిశోధకులు గొప్ప ఆవిష్కరణ చేసారు. పిండంలో మెదడు ఎదుగుదల క్రమాన్ని వివరించే ప్రపంచంలోనే అత్యంత విపులమైన 3డి మ్యాప్‌ను అభివృద్ధి చేసారు. గర్భంలో ఉండే పిండం రెండో త్రైమాసికంలో ఎదుగుదలను కచ్చితంగా నమోదు చేసారు. దానివల్ల మెదడు ఎదుగుదల క్రమంలో కణం స్థాయిలో చోటు చేసుకునే మార్పులను గ్రహించగలిగారు. తద్వారా నరాలకు సంబంధించిన వ్యాధులను అర్ధం చేసుకుని చికిత్స చేసే పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు సాధ్యమవుతాయి.
కొత్తగా ఆవిష్కరించిన ఈ బ్రెయిన్-అట్లాస్‌కు ‘ధారిణి’ అని పేరు పెట్టారు. డెవలప్‌మెంటల్ హ్యూమన్ అట్లాస్ ఆఫ్ రీజినల్ ఇమేజింగ్ అండ్ న్యూరాన్ ఇంటిగ్రేషన్’కు సంక్షిప్త రూపమే ఈ ’ధారిణి’. మానవ పిండాల్లోని మెదడుకు అత్యున్నత స్థాయి త్రీడీ రెజొల్యూషన్ రూపం అది. గర్భం ధరించిన 14వ వారం నుంచి 24వ వారంలో చోటు చేసుకునే కీలకమైన ఎదుగుదలను చిత్రీకరిస్తుంది. ఆ వ్యవధిలో మెదడు నిర్మాణం, పనితీరుల్లో గణనీయమైన మార్పులు జరుగుతుంటాయి.
ఈ బ్రెయిన్ అట్లాస్ ప్రత్యేకత ఏంటంటే మెదడుకు సంబంధించిన ఆటిజం వంటి శారీరక రుగ్మతలు, అవకరాలను చాలా ముందుగా గుర్తించగలదు, ఊహించగలదు. పరిశోధకులు ఈ విధానానన్ని ఓపెన్ యాక్సెస్ రిసోర్స్‌గా మార్చారు. దానివల్ల ప్రపంచవ్యాప్త పరిశోధకులు ఆ 3డి మ్యాప్‌లను అధ్యయనం చేయవచ్చు. ప్రీనేటల్ న్యూరోసైన్స్, మెడికల్ డయాగ్నస్టిక్స్ రంగాలను ఈ పరిశోధన విప్లవాత్మకమైన మార్పులు తేగలదు.