సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ ఊరట దక్కింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేసిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు. ఛార్జిషీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్‌లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది.
గత ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కేసు విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచించింది.
స్కిల్ కేసులో 2023 నవంబరులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా దానిని అప్పటి వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులోసవాలు చేసింది.
చంద్రబాబు బెయిల్ రద్దు చేయాటంటూ ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్ దాఖలు చేసిన స్వర్ణాంధ్ర పత్రిక విలేకరి బాల గంగాధర్ తిలక్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసుతో మీకేం సంబంధమని ప్రశ్నించింది. పిల్ దాఖలు చేయడానికి ఉన్న అర్హత ఏంటని , బెయిల్ వ్యవహారాల్లో థర్డ్ పార్టీ ఎందుకు ఉంటారని ధర్మాసనం నిలదీసింది.
వైసీపీ హయాంలో నమోదైన స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు 53 రోజుల పాటు జైలులో ఉన్నారు. ఆ తర్వాత ఆయనకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.