భారత సైన్యం సేవలను ప్రధాని మోదీ మరోసారి కొనియాడారు. అంకితభావం, దృఢ సంకల్పం, అచంచల ధైర్య సాహసాలు, వృత్తి నైపుణ్యానికి భారత సైన్యం ప్రతీకగా నిలిచిందన్నారు.
నేడు(జనవరి 15) భారతదేశ సైనిక దినోత్సవం సందర్భంగా భద్రతా బలగాలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మీ త్యాగాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ‘ ఆర్మీ డే’ శుభాకాంక్షలు తెలిపారు.
సాయుధ దళాలు,వారి కుటుంబ సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ప్రధాని మోదీ, దేశ భద్రతకు కాపాలదారుగా వ్యవహరిస్తున్న ఆర్మీకి వందనం అర్పిస్తున్నాని పేర్కొన్నారు.
సరిహద్దులను కాపాడటంతో పాటు ప్రకృతి విపత్తుల సమయంలో మానవతా సాయం అందించడంలో సైన్యం తనదైన ముద్ర వేసుకుందన్నారు.
భారత సైనిక దినోత్సవం
బ్రిటీషర్ల పాలన ముగిసిన తర్వాత జనవరి 15, 1949న జనరల్ కరియప్ప భారత సైన్యానికి నాయకత్వం వహించారు. అందుకే ప్రతీ ఏడాది జనవరి 15న ‘ఆర్మీ డే’ జరుపుకుంటారు. మన రాజ్యాంగం 1950 నాటికి పూర్తిగా సిద్ధం కాగా ఆ తర్వాత కొద్ది కాలంలోనే భారత సైన్యం ప్రపంచంలోని మేటి సైన్యాలలో ఒకటికి నిలిచింది. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో కూడా భారత సైన్యం ప్రధాన పాత్ర పోషిస్తోంది.