ఉత్తరప్రదేశ్ అలీగఢ్ ప్రాంతంలోని లాఢౌలీ గ్రామంలో 50 కుటుంబాలు సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చాయి. గతంలో క్రైస్తవంలోకి మతం మారిన ఆ కుటుంబాలు జనవరి 12న తిరిగి స్వధర్మంలోకి చేరుకున్నాయి. ఆ కుటుంబాలలోని వారు గతంలో ప్రేయర్ మీటింగ్‌లకు హాజరవుతూ క్రైస్తవం వైపు ఆకర్షితులయ్యారు. దాంతో వారిని ప్రలోభపెట్టి మోసపూరితంగా తమ మతంలోకి చేర్చుకున్నారు. అయితే గార్గి కన్యా గురుకుల్, అగ్నిసమాజ్ సంస్థలు జోక్యం చేసుకుని ఆ కుటుంబాల వారిని మళ్ళీ స్వధర్మంలోకి తీసుకొచ్చాయి.
భారతీయ వైదిక ధర్మం ప్రకారం హోమం నిర్వహించి, క్రైస్తవంలోకి మారిన కుటుంబాలను ఘర్‌వాపసీ చేసారు. స్వధర్మంలోకి పునరాగమనం చేస్తున్న కుటుంబాలను ఆహ్వానిస్తూ వారితో తిరిగి తమ నిజమైన సాంస్కృతిక, ధార్మిక అస్తిత్వానికి కట్టుబడి ఉంటామని వాగ్దానం చేయించారు. కులవివక్షను పాటించబోమని, మద్య మాంసాదులు ముట్టబోమని, అశ్లీలమైన పనులకు దూరంగా ఉంటామని కూడా వాగ్దానం చేయించారు. ఓంకార నాదం, ధార్మిక నినాదాలతో వారి స్వధర్మ పునరాగమన ఘట్టం ముగిసింది.
ఈ ఘర్ వాపసీ కార్యక్రమాన్ని గార్గి కన్యా గురుకులం నిర్వహించింది. వారికి అగ్నిసమాజ్ సంస్థ సహకరించింది. ఆ సంస్థను స్థాపించినది ఆచార్య మను ఆర్య, ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన వేదపండితుడు సంజీవ్ నేవార్ అనే విద్యాధికులు కావడం విశేషం. మతమార్పిడులను నిరోధించడమే వారికి జీవిత లక్ష్యం. మతమార్పిడి అంటే మోసమనీ, సనాతన ధర్మాన్ని దేశవ్యాప్తంగా పునరుజ్జీవితం చేయాలనీ వారి ఆశయం. మతమార్పిడుల కారణంగా హిందూ సంప్రదాయ ఆచార వ్యవహారాలు పలచబడిపోయిన చోట్ల, మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని పరిరక్షించుకోవలసిన ప్రాధాన్యత ఆవశ్యకత గురించి ఆచార్య మను ఆర్య వివరించారు.
అగ్నిసమాజ్ సంస్థ కేవలం మతమార్పిడులను వెనుకకు తిప్పడం మాత్రమే కాదు, హిందువులలోనూ ఐకమత్యం, ఆధ్యాత్మిక దృఢత్వాన్ని పెంపొందింపజేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది. బలవంతపు మతమార్పిడులను నివారించి సమాజంలో వైదిక విలువలను వ్యాపింపజేయడం వారి ఆశయం.