ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో ఇటీవల జరిగిన హింసాకాండకు సంబంధించి మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసారు. ఘటన జరిగిన నాటి నుంచీ పరారీలో ఉన్న ఆమిర్ అన్సారీ, మొహమ్మద్ ఇమ్రాన్ అనే నిందితులను సోమవారం పట్టుకున్నారు. అన్సారీ, ఇమ్రాన్ ఇద్దరూ కోట్‌గర్బీ మొహల్లాకు చెందినవారు. 2024 నవంబర్ 24న పోలీసుల మీద రాళ్ళు విసిరిన దుండగుల్లో వారూ ఉన్నారు.
కోర్టు ఉత్తర్వుల మేరకు సంభాల్‌లోని జామా మసీదులో సర్వే చేయడానికి వెళ్ళిన పోలీసుల మీద ముస్లిములు రాళ్ళు రువ్వి దాడి చేసారు. ఆ దుర్ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అన్సారీ, ఇమ్రాన్ ఇద్దరూ ఆనాటి సంఘటన తర్వాత వేరువేరు పట్టణాలకు పారిపోయారు. అయితే పోలీసులు వారిపై నిఘా వదల్లేదు. తాజాగా సోమవారం నాడు వారు తమతమ ఇళ్ళకు వచ్చిన సందర్భంలో పోలీసులకు దొరికిపోయారు.
హింస జరిగినప్పుడు సంఘటనా స్థలం దగ్గర తీసిన వీడియోలు, నిఘా కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితుల ఉనికి, వారి పేర్లను కనుగొన్నామని సంభాల్ ఎస్‌పీ వివరించారు. అన్సారీ, ఇమ్రాన్‌లతో కలిపి ఇప్పటివరకూ మొత్తం 60 మందిని అరెస్ట్ చేసారు. వారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. ఈ కేసులో ఇంకా మరో 89మంది నిందితులు పరారీలో ఉన్నారు.