మావోయిజం క్యాన్సర్ లాంటిది అని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్సాయి వ్యాఖ్యానించారు. దాన్ని మూలం నుంచీ ఛేదించాలనీ, ఆ సమస్యను ఒక్కసారి పరిష్కరించాలని పిలుపునిచ్చారు. సోమవారం నాడు సుక్మా జిల్లా బస్తర్లో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన, పూర్తయిన కార్యక్రమాల ఆవిష్కరణ పనుల్లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
‘‘మావోయిజం క్యాన్సర్ లాంటిది. దాన్ని నిర్మూలించాలంటే దాని మూలంపై దాడి చేయాలి. మావోయిస్టులు బస్తర్ లాంటి ప్రాంతాల్లో చీడపురుగుల్లా వ్యాపించేసారు. స్థానిక ప్రజలను భయభ్రాంతులను చేస్తూ, వారిని దోచుకుంటూ బతికేస్తున్నారు. ఈ ప్రాంతాలు ఒకప్పుడు వారికి సురక్షితమైన ప్రదేశాలు. కానీ మన భద్రతా బలగాలు ఈ ప్రదేశంలోకి చొరబడ్డాయి, వారితో నేరుగా తలబడ్డాయి. ఇది గొప్ప నిర్ణయాత్మకమైన అడుగు’’ అన్నారు.
భద్రతా బలగాల ధైర్యసాహసాలను ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ప్రశంసల్లో ముంచెత్తారు. ‘‘వాళ్ళు మావోయిస్టుల కంచుకోటలోకి చొరబడి, వారిని ఓడించారు. గత ఒక్క యేడాదిలోనే వివిధ ఎన్కౌంటర్లలో 230కి పైగా మావోయిస్టులను తుదముట్టించారు’’ అని చెప్పారు.
బస్తర్ డివిజన్ ఇన్నాళ్ళూ మావోయిస్టు హింసతో అట్టుడికిపోయిందనీ, అభివృద్ధికి దూరంగా ఉండిపోయిందనీ సీఎం విష్ణుదేవ్సాయి ఆవేదన వ్యక్తం చేసారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన యేడాది కాలంలో వ్యూహాత్మకంగా మావోయిస్టు ప్రాంతాల్లో భద్రతాదళాల ప్రాబల్యాన్ని పెంచామని చెప్పారు. ఇప్పుడు మావోయిస్టులు అతితక్కువ ప్రదేశానికి పరిమితమైపోయారనీ, పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారనీ చెప్పుకొచ్చారు.