మహాకుంభమేళా 2025లో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలనుంచీ ఆధ్యాత్మిక భావజాలం కలిగిన సాధుసంతులు, సన్న్యాసులు వస్తున్నారు. వారిలో బాబా మోక్షపురి ఒకరు. ఆయన గతంలో అమెరికన్ ఆర్మీలో సైనికుడు. వ్యక్తిగత జీవితంలో కష్టనష్టాల తర్వాత సనాతన ధర్మం వైపు ఆకర్షితుడై క్రమంగా సాధువుగా మారాడు. ఒక సైనికుడు సాధువుగా మారిన క్రమం ఆసక్తికరం.
బాబా మోక్షపురి పూర్వనామం మైకేల్. న్యూ మెక్సికో ప్రాంతానికి చెందినవాడు. అతనిలో సనాతన ఆధ్యాత్మిక జాగృతి 2000 ప్రారంభంలో కలిగింది. అప్పట్లో అతను తన కుటుంబంతో సహా భారతదేశాన్ని సందర్శించాడు. ఆ పర్యటనలోనే అతనికి సనాతన ధర్మపు ఘనమైన సంప్రదాయాలతో పరిచయం ఏర్పడింది. ధ్యానం, యోగం, భారతీయ తాత్వికతలతో అనుబంధం కలిగింది. ‘‘ఆ పర్యటన నా జీవితంలో మేలిమలుపు. భారతదేశపు సంస్కతీ సంప్రదాయాలు నన్ను కదిలించివేసాయి. నాలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించాయి’’ అని చెబుతాడతడు.
అయితే అతని కుమారుడి మరణం అతనిలో ఆధ్యాత్మిక చింతనను మరింత ముందుకు తీసుకువెళ్ళిన అంశం. నా హృదయాన్ని వ్రక్కలు చేసిన ఆ సంఘటన, జీవితం బుద్బుదప్రాయమని, క్షణభంగురమనీ నాకు నేర్పింది. ఆ గడ్డు పరిస్థితుల్లో నాకు సాంత్వన కలిగించింది ధ్యానం, యోగం మాత్రమే’’ అని చెప్పాడు. వ్యక్తిగత జీవితంలో కలిగిన ఆ నష్టం మైకేల్ దృష్టిని ప్రాపంచిక విషయాల నుంచి మరింత లోతులకు తీసుకువెళ్ళింది. ఆ క్రమంలోనే అతను తన జీవితాన్ని ఆధ్యాత్మికతకు అంకితం చేసాడు, సనాతన ధర్మాన్ని ఆశ్రయించాడు.
బాబా మోక్షపురి ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రధానంగా ప్రభావం చూపించింది నీమ్ కరోలీ బాబాతో అతని బంధం. ‘‘నీమ్ కరోలీ బాబా ఆశ్రమంలోని శక్తి నన్ను సమూలంగా మార్చేసింది. ఆయనలో భగవాన్ హనుమంతుడి స్ఫూర్తి ఉన్నట్లు అనిపిస్తుంది. ఆయన ప్రభావం నాలో యోగ, ధ్యానాలపై భక్తిని పెంపొందించింది’’ అని బాబా మోక్షపురి అంటారు. నీమ్ కరోలీ బాబా ఆశ్రమంలో విన్న ప్రవచనాల ప్రభావంతో అతను జునా అఖాడాలో చేరాడు. అప్పటి నుంచీ ప్రతీ కుంభమేళాకూ హాజరవుతున్నాడు.
2016లో మొదటిసారి ఉజ్జయిని కుంభమేళాలో పాల్గొన్న అనుభవం బాబా మోక్షపురి జీవితంలో ఓ కీలక ఘట్టం. ఈ దేశపు పవిత్ర ఆచారాలు సంప్రదాయాలపట్ల ఆయనకు మరింత గౌరవం పెరిగిన సందర్భమది. సనాతన ధర్మం గురించి తనకు తెలిసిన ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా పెట్టుకున్న బాబా మోక్షపురి, అప్పటినుంచీ ప్రతీ కుంభమేళాకు తప్పనిసరిగా హాజరవ్వాలని నిర్ణయించుకున్నాడు.
ఇప్పుడు బాబా మోక్షపురి ప్రణాళికలు భారతదేశం కంటె ఆవలకు విస్తరించాయి. అతనిప్పుడు అమెరికాలోని న్యూ మెక్సికోలో ఒక ఆశ్రమం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ఆశ్రమం ద్వారా భారతీయమైన తత్వశాస్త్రం, యోగం, ధ్యానం వంటి వాటితో పాటు ప్రపంచానికి అంతటికీ మార్గదర్శకంగా నిలిచే సనాతన ధర్మపు విలువలను ప్రచారం చేయాలన్నది అతని ఉద్దేశం.