జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్ (ఇందూరు)లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు.పసుపు బోర్డు ఏర్పాటుతో ప్రధాని నరేంద్ర మోదీ గత ఎన్నికల సమయంలో తెలంగాణకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చారు.
గత ఏడాది అక్టోబర్ 4న కేంద్ర వాణిజ్య శాఖ జాతీయ పసుపు బోర్డుకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా, నేడు ప్రారంభించారు. బోర్డు చైర్మన్గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలానికి చెందిన బీజేపీ నేత పల్లె గంగారెడ్డిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం నిజామాబాద్లో ఉన్న రీజినల్ స్పైస్ బోర్డు కార్యాలయంలోనే నేటి నుంచి జాతీయ పసుపు బోర్డు కార్యకలాపాలు కొనసాగనున్నాయి.
ప్రపంచంలోనే భారత్లోనే పసుపు అత్యధికంగా సాగవుతోంది. 2022-23 ఏడాదిలో దేశవ్యాప్తంగా 3.24 లక్షల హెక్టార్లలో పసుపు సాగు చేయగా.. 11.61 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. మహారాష్ట్రలో 2.78 లక్షల టన్నులు, తెలంగాణలో 2.32 లక్షల టన్నుల పసుపు పండింది. ప్రపంచ మార్కెట్లో భారత్ వాటా సుమారు 62 శాతంగా ఉంది.
2019 లోక్సభ ఎన్నికల్ పసుపు బోర్డు అంశం చాలా కీలకంగా మారింది. అప్పటి బీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవితపై 176 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేసిన వారణాసిలోనూ ఇందూరుకు చెందిన 30 మంది పసుపు రైతులు నామినేషన్లు దాఖలు చేశారు.