తమిళనాడులోని మదురై నగరంలో ప్రపంచ ప్రఖ్యాతి గడించిన జల్లికట్టు కార్యక్రమం ఇవాళ మకర సంక్రాంతి సందర్భంగా ప్రారంభమైంది. అవనియపురం గ్రామంలో మొదటి రోజు జల్లికట్టు పోటీలు మొదలయ్యాయి. ఆ పోటీల్లో 1100 ఎద్దులు, 900 మంది ఎద్దులను వెంబడించేవాళ్ళు పాల్గొంటున్నారు.
పోటీలో ఉత్తమమైన ఎద్దుకు రూ.11 లక్షల విలువైన ట్రాక్టర్ బహూకరిస్తారు. ఉత్తమమైన ఆటగాడికి రూ.8లక్షల విలువైన కారు బహూకరిస్తారు. మదురై జిల్లాలో మరో రెండు జల్లికట్టు పోటీలు జరుగుతాయి. రేపు పలమేడు గ్రామంలోను, ఎల్లుండి అళంగనల్లూరు గ్రామంలోనూ జల్లికట్టు నిర్వహిస్తారు. పటిష్ట భద్రత, కట్టుదిట్టమైన నియమ నిబంధనల నడుమ జల్లికట్టులో ప్రజలు ఆసక్తిగా పాల్గొంటున్నారు.
తమిళనాడులో మదురై జిల్లాలో, ప్రత్యేకించి అళంగనల్లూరులో జరిపే జల్లికట్టు పోటీలు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గడించాయి. తమిళనాడు గ్రామీణ సంస్కృతికి ఈ పోటీలు నెలవుగా నిలుస్తాయి. ఈ యేడాది మొదటి జల్లికట్టు కార్యక్రమం పుదుక్కోటై జిల్లా తచ్చన్‌కురిచి గ్రామంలో జరిగింది. తమిళ రాష్ట్రంలో అతి ఎక్కువ జల్లికట్టు పోటీలు పుదుక్కోటై జిల్లాలో జరుగుతాయి. జనవరి నెల మొదటినుంచి మే నెలాఖరులోపు 120కి పైగా జల్లికట్టు పోటీలు నిర్వహిస్తారు.