తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు వేడుకగా సాగుతున్నాయి. గంగిరెద్దుల ఆటలు, ముంగిళ్లలో ముగ్గురు, గొబ్బిమ్మలతో వేడుకలు కోలాహలంగా జరుపుకుంటున్నారు. కోస్తా జిల్లాల్లో కోడిపందాలు, పడవ పందాలు, ఎడ్ల బండలాగుడు పందాలు జోరుగా సాగుతున్నాయి. మహిళలు పిండివంటలు తయారీలో బిజీగా గడుపుతున్నారు. బొమ్మల కొలువులతో పిల్లలు సరదాగా పండగ జరుపుకుంటున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పంటలు ఇంటికొచ్చే వేళ అందరికీ శుభం జరగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధాని మోదీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోదీ, నటుడు చిరంజీవి, ప్రముఖ డాక్టర్ నాగేశ్వరెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
కోస్తా జిల్లాల్లో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. రెండు రోజులుగా సాగుతోన్న కోడి పందాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. కొన్ని బరుల్లోకి ప్రవేశించడానికి రూ.10 వేల టికెట్ నిర్ణయించారు. ఒక్కో బరిలో 20 కోట్లు చేతులు మారుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. జక్కంపూడి, సింగ్ నగర్, రామవరప్పాడు, యనమలకుదురు, ఈడుపుగళ్లు, భీమవరం, దెందులూరు, పెద్దాపురం, రాజోలు ప్రాంతాల్లో భారీ బరులను సిద్దం చేసి, లైటింగ్ ఏర్పాట్లు చేశారు. 24 గంటల పాటు కోడి పందాలు నిర్వహించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.
కోడికి కత్తికట్టి పందాల్లో వదలరాదని హైకోర్టు ఆదేశించినా రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు చూస్తూ ఉండిపోయారు. జక్కంపూడిలో బరిని పోలీసులు ధ్వంసం చేయగా, రాజకీయ ఒత్తిళ్లతో మరలా ప్రారంభించారు. ఈడుపుగళ్లులో 30 ఎకరాల్లో బరులు నిర్వహిస్తున్నారు. ఒక్కో కోడి లక్షపైగా పలుకుతోంది. విదేశాలకు చెందిన పెరూ జాతి కోళ్లు కూడా ఈ ఏడాది బరుల్లో సందడి చేస్తున్నాయి.